ఇంట్లో శివలింగం ఉంచాలనుకుంటున్నారా..? ఈ దిశలో పెడితే కష్టాలు తప్పవు..!

శివభక్తి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆచారం. దేవాలయాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించడం శివారాధనలో ప్రధాన భాగం. కానీ కొంతమంది భక్తులు ఇంట్లోనే శివలింగాన్ని ఉంచి పూజించాలని కోరుకుంటారు. అయితే పండితులు చెబుతున్నట్టుగా, ఇంట్లో శివలింగాన్ని ఉంచే ముందు వాస్తు నియమాలు తప్పక పాటించాలి, లేకపోతే పూజ ఫలితం రాకుండా, ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని చెబుతున్నారు.

వాస్తు ప్రకారం శివలింగాన్ని ఉంచే సరైన దిశ అత్యంత కీలకం. లింగం నుండి నీరు ప్రవహించే పానువట్టం ఉత్తర దిశ వైపు ఉండాలి. ఎందుకంటే ఉత్తరం అనేది కైలాస దిశ.. శివుడి నివాసం. ఉత్తరం సాధ్యం కాకపోతే తూర్పు దిశ వైపు కూడా ఉంచవచ్చు. పూజ చేసే వ్యక్తి ముఖం తూర్పు దిశలో ఉండాలి. ఇది శుభఫలితాలను అందిస్తుంది. దక్షిణ దిశ వైపు శివలింగం ఉంచడం వాస్తు ప్రకారం అత్యంత అశుభం.

ఇంకో ముఖ్యమైన అంశం పరిమాణం. ఇంట్లో ఉంచే శివలింగం చాలా చిన్నదిగా ఉండాలి. బొటనవేల కంటే పెద్ద లింగాన్ని ఇంట్లో ఉంచరాదు. పెద్ద లింగాలు ఆలయాలకే ఉద్దేశించినవి, అవి గృహశాంతికి కాకుండా తపోబలానికి సంబంధించినవి. ఇంట్లో పెద్ద లింగాన్ని ఉంచడం వల్ల శక్తి అసమతౌల్యం ఏర్పడి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, మనశ్శాంతిపై ప్రభావం చూపుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది.

శివలింగం తయారైన పదార్థం కూడా కీలకం. పండితుల ప్రకారం నర్మదా నది రాతితో తయారైన నర్మదేశ్వర శివలింగం అత్యంత శుభకరమైనది. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. అదనంగా వెండి, రాగి వంటి లోహాలతో చేసిన లింగాలను కూడా ఉపయోగించవచ్చు. కానీ వాటిపై పాము చుట్టుకున్న ఆకారంలో డిజైన్ ఉండటం తప్పనిసరి. ఇది కాలసర్ప దోషం వంటి దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. స్ఫటిక శివలింగం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది .. ఇది ఇంట్లో ప్రశాంతత, శాంతిని పెంచుతుంది.

ఇంటి వాస్తు ప్రకారం మరో తప్పు చాలామంది చేసే పని ఒకకంటే ఎక్కువ శివలింగాలు ఉంచడం. లింగం అనేది శక్తి కేంద్రం. ఒకే గృహంలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంచితే ఆ శక్తులు పరస్పరం ఢీ కొని ఎనర్జీ ఇంబ్యాలెన్స్‌కు దారితీస్తాయి. ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యం, సంపద, మనశ్శాంతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇంట్లో ఒకే ఒక చిన్న శివలింగాన్ని భక్తితో ప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజ చేయడం ఉత్తమం. రోజూ పూజ చేయడం సాధ్యం కానివారు ఇంట్లో శివలింగం ఉంచకపోవడమే మేలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. భక్తితో, నియమ నిష్టలతో ప్రతిష్ఠించిన శివలింగం మాత్రమే గృహానికి శాంతి, ఆరోగ్యం, సంపదను అందిస్తుంది.