Y.S.Sharmila: వైయస్సార్ జిల్లాకు పేరు మార్చిన కూటమి సర్కార్….ఎన్టీఆర్ జిల్లాకు మార్చాల్సిందే: షర్మిల

Y.S.Sharmila: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత వైయస్ సొంత జిల్లా అయిన కడపకు వైయస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కడప జిల్లాకు వైయస్సార్ జిల్లాగా పేరు మార్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి వైయస్సార్ జిల్లాగా ఉన్నటువంటి ఈ పేరును వైయస్సార్ కడప జిల్లాగా మార్చేశారు. ఇలా ఈ జిల్లా పేరు మార్చడంతో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వై. ఎస్ షర్మిల స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ…టీడీపీ నిర్వహించనున్న మహానాడులో మాజీ సీఎం వైఎస్సార్ పేరు పలకాల్సి వస్తుందని ఒక్కరోజు ముందు జిల్లా పేరునే మార్చేశారని షర్మిల అన్నారు. వ్యక్తిగతంగా ఇది బాధ కలిగించే అంశం అయినప్పటికీ కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు.

ఇలా జిల్లా పేరు మార్చడం వెనక కూటమి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి దురుద్దేశం లేకపోయినా,వైఎస్సార్ పేరు మీద కక్ష్యపూరిత రాజకీయాలు అజెండా కాదు అనుకుంటే,సెంటిమెంట్ ప్రకారం పాత జిల్లా పేర్లు కొనసాగించాలని కోరిక ఉంటే, విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నామని అన్నారు.

వైయస్సార్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా తెలుగు జాతి గర్వించే ఈ గడ్డ కన్న బిడ్డలేనని షర్మిల తెలిపారు. వారిద్దరూ ప్రజల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోతారని తెలిపారు. ఒకరికి ఒకలా మరొకరికి ఇంకోలాగా రాజకీయాలను ఆపాదించొద్దు అంటూ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.