త్వరలో అతి త్వరలో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ప్రస్తుతానికైతే అది షర్మిల పార్టీ.. అలాగే చెలామణీ అవుతోంది. వైఎస్ షర్మిల స్థాపించబోయే పార్టీకి సంబంధించి తెరవెనుక ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయి. పార్టీ పేరు, జెండా, ఎజెండాలను షర్మిల ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తన జోరుని మరింత పెంచారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్.. కరువు మండలాలు కలిగి వుండటమేంటి.? అంటూ ప్రశ్నించేశారు షర్మిల. ఫీజు రీ-ఎంబర్సుమెంట్, ఆరోగ్య శ్రీ.. ఇలాంటివన్నీ పక్కగా అమలవడంలేదన్నది షర్మిల ఆరోపణ. వైఎస్సార్ హయాంలో చాలా సంక్షేమ పథకాలు తెరపైకొస్తే, వాటిని ఆ తర్వాత నీరుగార్చేశారని షర్మిల ఆరోపిస్తున్నారు.
వైఎస్సార్ పాలనతో మేలు పొందిన ప్రతి ఒక్కరూ తన వెంట రాజన్న రాజ్యం సాధించేందుకు వస్తారన్నది షర్మిల ఉవాచ. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. తెలంగాణ కేంద్రంగా రాజకీయ పార్టీ స్థాపించాలనుకోవడమే షర్మిల చేస్తోన్న పెద్ద సాహసం. నిజానికి, పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి.. ఇన్ని రోజులైనా షర్మిలకు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతోంది గులాబీ పార్టీ. మరోపక్క, ఆంధ్రా పార్టీ అనే ముద్ర వున్నా షర్మిల పార్టీ వైపుకు తెలంగాణ నేతలు కొందరు వెళుతున్నారు. అంటే, పార్టీ పెట్టడానికి ముందే షర్మిల సక్సెస్ అయినట్లు భావించాలేమో. టీడీపీని దెబ్బ తీసినట్లో, వైఎస్సార్సీపీని దెబ్బ తీసినట్లో షర్మిల పార్టీని దెబ్బ తీయడం గులాబీ పార్టీకి కుదరకపోవచ్చు. అప్పటి పరిస్థితులు వేరు, ప్రస్తుత ఈక్వేషన్ వేరు.