72 గంట షర్మిల దీక్ష.. రాంగ్ టైమింగ్.!

Sharmila Deeksha
Sharmila Deeksha
రాజకీయాల్లో ముందడుగు వేయాలంటే వ్యూహాలు పక్కాగా వుండాలి. వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తే అంతే సంగతులు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగానే వున్న మాట వాస్తవం. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యను పట్టుకుని రాజకీయం చేస్తే లాభమేంటి.? లాభం లేదు సరికదా, నష్టమే ఎక్కువ.. అని షర్మిల చేపట్టిన దీక్షపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖమ్మం బహిరంగ సభలోనే ఈ దీక్ష గురించి షర్మిల ప్రకటన చేశారు. మాటకు కట్టుబడి దీక్ష చేస్తున్నారుగానీ, ఈ దీక్షకి జనం నుంచి స్పందన కనిపించడంలేదు. పోలీసు శాఖ నుంచి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకే దీక్షకు అనుమతి వుంది. షర్మిల మాత్రం 72 గంటల పాటు దీక్ష కొనసాగుతుందంటున్నారు. ఆ తర్వాత కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని చెబుతున్నారామె. ప్రస్తుతం తెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా వుంది.
 
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిశాక, తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ దిశగా ఏదో ఒక ప్రకటన రావొచ్చన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంటే, షర్మిల దీక్ష అట్టర్ ఫ్లాప్ కాబోతోందన్నమాట. మొదటి రోజు దీక్షకే జనాన్ని సమీకరించలేకపోవడమంటే ఇక్కడ నాయకత్వ వైఫల్యం సుస్పష్టం. నిజానికి, నిరుద్యోగ సమస్య అనేది చాలా సున్నితమైనది. పెద్దయెత్తున నిరుద్యోగులు షర్మిలకు అండగా నిలవాల్సి వుంది. కానీ, అలా జరగలేదంటే అందుకు కారణాలు చాలానే వున్నాయి. కొత్త పార్టీ పెట్టనున్న షర్మిలకి ఇది తొలి నిరసన దీక్ష కావడంతో, ముందస్తుగా సరైన ప్లానింగ్ చేసుకుని వుండాల్సిందేమో. షర్మిల దీక్ష ఫ్లాప్ అయ్యిందంటూ తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు.