కరోనా భయంతో ప్రజలంతా ఎంత ఖర్చైనా ముక్కుకి మాస్కులు మాత్రం కచ్చితంగా ధరిస్తున్నారు.5 రూలు మాస్క్ ను 15 రలు కూడా కొన్న పరిస్థితులున్నాయి. దేశం మొత్తం కరోనా చుట్టేయడంతో మాస్క్ ధరించక తప్పలేదు. ప్రభుత్వం సరఫరా చేసే మాస్కులు కోసం ఎదురుచూడుకుండా ఎవరి మాస్క్ వారే కొనుక్కుని పెట్టుకుంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వైరస్ వ్యాప్తి మరింత పెరగడంతో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవరిస్తున్నారు జనాలు. అయితే పుర్రికో బుద్ది జిహ్వకో రుచి అన్నట్లు! ఓ వ్యక్తి ఏకంగా బంగారం మాస్క్ నే తయారు చేసి మూతికి తగిలించుకున్నాడు. అక్షరాలా 2.89లక్షల విలువ చేసే బంగారం మాస్క్ ని తయారు చేయించి పెట్టుకున్నాడు.
మహరాష్ర్టలోని పింప్రి- చింద్వాడ్ వాసి శంకర్ అనే వ్యక్తి ఇలా ప్రయత్నించాడు. ఆ బంగారం మాస్క్ కి గాలి తీసుకోవడానికి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఈ మాస్క్ కరోనా నుంచి కాపాడుతుందో లేదో తెలియదు గానీ..బంగారం ధరించానన్న తృప్తి మాత్రం కావాల్సినంత దొరికిందంటున్నాడు శంకర్. మాస్క్ పెట్టుకుని బయట తిరగుతుంటే అందరూ తననే చూస్తున్నారని..ఆ ఫాలోయింగ్ ఎంతో నచ్చిందంటున్నాడు. మొత్తానికి శంకర్ రూపంలో బంగారం మాస్క్ ని కూడా సమాజం చూడగల్గింది. ఇప్పటికే కొంత మంది వినూత్నంగా వెండి మాస్క్ లు తయారు చేయించుకుని వాడుతోన్న సంగతి తెలిసిందే. అప్పుడే బంగారం మాస్క్ లు కూడా వస్తాయేమోనని సందేహం వ్యక్తమైంది. ఇప్పుడు శంకర్ రూపంలో అది జరిగింది.
ప్రస్తుతం బంగారం మాస్క్ తో ఉన్న శంకర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అలాగే శంకర్ మెడలో బంగారం గోలుసు కూడా భారీగానే ఉంది. మొత్తానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఇక చింద్వాడ్ ప్రాంతంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక్కడ కేసులు మూడు వేలకు పైగానే ఉన్నాయి. మరణాలు 50కి పైగా సంభవించాయి.