ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ పరిశ్రమ గురించే మాట్లాడుకునేవారు. సినిమాలంటే వాళ్ళలా చేయాలని, దర్శకులంటే అక్కడి వారేనని, హిందీ హీరోలను మించినవారు లేరని తెగ భజన చేసేవారు. కానీ బాలీవుడ్లో పుట్టుకొచ్చిన సంక్షోభం అక్కడి హీరోలను తలకిందులు చేసేసింది. మారిన ప్రేక్షకుల అభిరుచుకి అనుగుణంగా కొత్తగా ఆలోచించే దర్శకులు లేక హీరోల మార్కెట్ తలకిందులైంది. ఈ ఎఫెక్ట్ షారుక్ ఖాన్ మీద మొదటగా పడింది. ఆ దెబ్బతో ఆయన సినిమాలకు కొన్నేళ్లుగా బ్రేక్ ఇచ్చుకున్నారు. అదే సమయానికి తెలుగు ఇండస్ట్రీ కెరటంలా ఎగిసింది. ‘బాహుబలి’ లాంటి సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసి పడేసింది. ‘సాహో, కెజిఎఫ్’ లాంటి సినిమాలు అక్కడి వారికి ముచ్చెమటలు పట్టించాయి.
ఒకానొక దశలో దక్షిణాది వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక హిందీ సినిమా పెద్దలు విషం చిమ్మిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆగలేదు మనవాళ్ళు. వరుసగా పాన్ ఇండియా సినిమాలను ప్రకటించారు. దాన్నే తట్టుకోలేని అక్కడి వారికి షారుక్ ఖాన్ లాంటి హీరో దక్షిణాది దర్శకుడితో సినిమా చేయడానికి పూనుకోవడం అస్సలు మింగుడు పడట్లేదు. పక్కా కమర్షియల్ సినిమా చేయాలనుకున్న షారుక్ ఖాన్ వెతుక్కుంటూ వచ్చి అట్లీని పట్టుకున్నారు. పిలిపించుకుని సినిమా ఓకే చేయించుకున్నారు. ఈ సంగతి తెలిసి హిందీ జనం ఇక్కడ డైరెక్టర్లు లేనట్టు అక్కడికి వెళ్లారే అంటూ పెదవి విరిచారు.
అయినా షారుక్ తగ్గలేదు.. అట్లీని వదల్లేదు. మంచి కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నారు. డిసెంబర్ నుండి ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఆరోజు చూడాలి బాలీవుడ్లో చాలామందికి కడుపు మండిపోవడం ఖాయం.