ఈమధ్య రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే కొందరు ఎమ్మెల్యేల విపరీత బుద్దులు ఎలాంటివో బయటపడుతోంది. ఏళ్లతరబడి టీడీపీలో ఉండి, పదవులు అనుభవించిన కొందరు ఎమ్మెల్యేలు అధికారం లేకపోవడంతో టీడీపీని వీడి వైసీపీతో అంటకాగుతున్నారు. వెళ్లిన పార్టీలో తమదే పైచేయి కావాలని తెగ ఉబలాటపడిపోతున్నారు. అందుకే పలు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి పార్టీలో ఉన్నవారికంటే ఇప్పుడొచ్చిన తమకే అన్నీ దక్కాలని, నియోజకవర్గాలకు తమ కనుసన్నల్లోనే నడవాలని అంటున్నారు. దీంతో వైసీపీ నేతల్లో అసహనం తన్నుకొస్తోంది. అందుకు నిదర్శనమే గన్నవరం, చీరాల నియోజకవర్గాలు.
గన్నవరంలో వంశీ మూలంగా పెద్ద రగడ నడుస్తోంది. వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు వంశీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వంశీ తమను రాజకీయంగా భూస్థాపితం చేయాలని చూస్తున్నట్టు ఇరువు నేతలు భావిస్తున్నారు. వంశీ వ్యవహరిస్తున్న తీరు కూడ అలానే ఉంది. అలాగే మరొక ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అయితే వంశీని మించిపోయారు. ఆయన దెబ్బకు సీనియర్ నేత ఒకరు విలవిల్లాడిపోతున్నారు. ఇప్పటికే బలరామకృష్ణమూర్తి తీరుతో చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ తలపట్టుకుని కూర్చోగా అద్దంకి సీనియర్ పొలిటీషియన్ బాచిన చెంచు గరటయ్య సైతం కరణం మూలాన ఇబ్బందులుపడుతున్నారు.
చెంచు గరటయ్య అద్దంకి నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో మూడుసార్లు టీడీపీ నుండి కాగా ఒకసారి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచారు. టీడీపీలో ఉండగా కరణం బలరాం మూలంగానే ఇబ్బందిపడిన ఆయన 2014లో వైసీపీలోకి వెళ్లారు. అప్పటి నుండి ఎదురుచూస్తుంటే గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చారు. కానీ టీడీపీ అభ్యర్థి గిట్టిపాటి రవి చేతిలో ఆయన ఓడిపోయారు. దీంతో ఇక తాను తప్పుకుని తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుండి టికెట్ తన కొడుక్కి ఇప్పించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈలోపే కరణం బలరాం ముసలం మాదిరి ఎంటరయ్యారు. తాను ఎలాగూ చీరాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నాను కాబట్టి తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుండి టికెట్ ఇవ్వాలని జగన్ వద్ద డిమాండ్ పెట్టారట. కరణంకు చీరాలలోనే కాదు అద్దంకిలో కూడ క్యాడర్ ఉంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ నుండి ఒకసారి, టీడీపీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారాయన. అందుకే కుమారుడ్ని అద్దంకి నుండి బరిలోకి దించితే సులభంగా గెలవొచ్చని, అప్పుడు తాను చీరాలను, కొడుకు అద్దంకిని ఏలుకోవచ్చనేది ఆయన అభిప్రాయం. ఇలా కరణం కొత్త స్కెచ్ వేయడంతో కుమారుడిని రంగప్రవేశం చేయించాలన్న చెంచు గరటయ్య ఆశలు ఆవిరవుతున్నాయి. స్థానిక వైసీపీ శ్రేణులు సైతం కరణం అత్యాశ మూలాన గరటయ్య కుటుంబానికి అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారట.