రాజకీయాల్ని పక్కన పెడితే, సెక్షన్ 124ఎ రద్దు విషయమై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది గనుక.. ఎంపీ రఘురామృష్ణరాజు పోరాటాన్ని తప్పు పట్టలేం. గతంలో ఈ సెక్షన్‌ని రద్దు చేయాలంటూ పలు కోర్టుల్లో ఆయా కేసులపై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు అభిప్రాయపడిన సందర్భాలున్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయ కోణంలో ఎక్కువగా ఈ సెక్షన్ కింద కేసులు నమోదవుతున్నాయి. సుప్రీంకోర్టులోనూ ఈ తరహా కేసులు కొన్ని విచారణలో వున్నాయి.. వాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సైతం, పోలీసులు.. ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేసిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెక్షన్ 124ఎ రద్దు విషయమై చర్చ జరగాల్సిన సందర్భమిదంటూ ఇటీవల ఓ ప్రముఖ న్యాయమూర్తి అభిప్రాయపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఇది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి అడ్వాంటేజ్‌గా మారుతోంది. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం తన మీద రాజకీయ కక్షతో కేసులు పెట్టి అరెస్టు చేయించిందనీ, ఈ క్రమంలోనే కుట్రపూరితంగా తన మీద సెక్షన్ 124ఎ కింద కేసు నమోదయ్యిందనీ రఘురామ ఆరోపిస్తున్నారు. సరే, రఘురామ.. ప్రభుత్వంపై చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి మీద విరుచుకుపడే క్రమంలో ఇచ్చిన వెకిలి ఎక్స్‌ప్రెషన్లు.. ఇదంతా వేరే చర్చ. కుల మతాల్ని రెచ్చగొట్టేలా, సమాజంలో అలజడి తెచ్చేలా రఘురామ చర్యలున్నాయన్నది ఆయన మీద నమోదైన కేసుల సారాంశం. దీన్ని భావప్రకటనా స్వేచ్ఛగా రఘురామ చెప్పుకుంటున్నారు.
కోర్టులు ఈ విషయంలో ఏం తేల్చుతాయన్నది ముందు ముందు తేలుతుంది. ఈలోగా రఘురామ సెక్షన్ 124ఎ రద్దుపై తనవంతు యుద్ధం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈ విషయమై ఓ లేఖ రాశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు పార్లమెంటులో గళం వినిపించాలని కోరారు. ఎప్పటినుంచో వున్న చర్చ కావడంతో, ఈ సెక్షన్ 125ఎ వ్యవహారం ముందు ముందు రాజకీయంగా పెను దుమారం రేపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్రం దిగొస్తే గనుక, రఘురామ విజయం సాధించినట్లే.. అప్పుడు రఘురామ పరపతి కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది.