Sebastian PC 524 Review:
రేటింగ్ : 2/5
రచన – దర్శకత్వం : బాలాజీ సయ్యపురెడ్డి
తారాగణం : కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ..తదితరులు
సంగీతం : జిబ్రాన్
ఛాయాగ్రహణం : రాజ్ కె. నల్లి
నిర్మాతలు : సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు
విడుదల : మార్చి 4, 2022
Sebastian PC 524 Review : కిరణ్ అబ్బవరం కొత్తగా వస్తున్న యువ హీరో. ‘రాజుగారు- రాణివారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ లతో పరిచయమయ్యాడు. చేతినిండా సినిమాలతో బిజీగా వున్నాడు.
కథలు బాగా వింటాడని, నిర్ణయాలు బాగా తీసుకుంటాడని, మేకింగ్ లో కూడా. ఇన్వాల్వ్ అవుతాడని పేరుంది. ఈ నేపథ్యంతో ఇప్పుడు ‘సెబాస్టియన్ పీసీ 524‘ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చాడు.
ఐతే విడుదలకి ముందే ట్రైలర్ కథ మొత్తం తెలిసిపోయేలా కట్ చేశారు. ఇందులో తను ఇన్వాల్వ్ కాలేదేమో. అయితే సినిమా చూస్తే ట్రైలర్ ఎలా కట్ చేసినా ఒకటే నన్పిస్తుంది. ఈ సారి కొత్త దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డితో కిరణ్ అబ్బవరం ఆశయం నెరవేరిందా లేదా చూద్దాం …
కథ
సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం ) అనే అతడికి బాల్యం నుంచీ రేచీకటి సమస్య వుంటుంది. ఈ విషయం ఎవరికీ చెప్పనని చిన్నప్పుడే తల్లి మేరీ తల్లి (రోహిణి) కి మాటిస్తాడు. అతను కానిస్టేబుల్ అవాలని మేరీ పట్టుదల. దీంతో కంటి సమస్యని దాస్తూ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరతాడు.
ఈ క్రమంలో తన సమస్య గురించి ప్రేమిస్తున్న హేలీ (నువేక్ష) కి, ఓ ఫ్రెండ్ కి, ఓ డాక్టర్ కి మాత్రమే చెప్తాడు. ఈ సమస్యతో సరిగా ఉద్యోగం చేయలేక తరచూ బదిలీ అవుతూంటాడు. అలా ఫైనల్ గా మదనపల్లి పోలీస్ స్టేషన్లో చేరి ఎస్సై (శ్రీకాంత్ అయ్యంగార్)కి భజన చేస్తూ నైట్ డ్యూటీలు పడకుండా చూసుకుంటాడు.
ఓరోజు మాత్రం నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది.అప్పుడు నీలిమ (కోమలీ ప్రసాద్) అనే వివాహిత హత్య జరుగుతుంది. రేచీకటి కారణంగా ఆమెని కాపాడలేక పోతాడు. అంతేగాక హత్యాస్థలంలో హంతకులు సాక్ష్యాధారాలు మాయం చేస్తున్నా చూడలేకపోతాడు. దీంతో సస్పెండ్ అవుతాడు.
ఇలా వుండగా ఈ హత్యతో తను ప్రేమిస్తున్న హేలీ కి సంబంధమున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సస్పెండ్ అయిన సెబాస్టియన్ ఈ కేసులో ఎందుకు, ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? ఇన్వాల్వ్ అయి తెలుసుకున్న నిజాలేమిటి? హంతకులెవరు? ఇవీ మిగతా కథలో తెలిసే విషయాలు.
ఎలా వుంది కథ
కామన్ సెన్స్ ప్రకారం చూస్తే ఇలాటి కథ వుండేందుకు అవకాశం లేదు. ఎందుకంటే రేచీకటి (నిక్టలోపియా) ని నయం చేసే చికిత్స వుంది. ఇప్పుడు కాదు, పూర్వమెప్పట్నుంచో వుంది- ప్రాచీన కాలంలో మూలికలతో మొదలై. ఓ నాల్గు కారణాలతో రేచీకటి కంటి చూపు సమస్య వస్తుంది.
ఈ నాల్గూ చికిత్స తీసుకుంటే హాంఫట్ అయిపోతాయి. ఇలా చికిత్స వుండి, రేచీకటి (చీకట్లో చూడలేని) సమస్యని తొలగించుకునే అవకాశమున్నాక, హీరోకి ఈ సమస్యని ఆపాదిస్తూ కథ చేస్తే హాస్యాస్పదంగా వుంటుంది. హీరో గాడికి ఇది కూడా తెలియదురో- కామన్ సెన్సు లేదనుకుంటారు ప్రేక్షకులు.
ఒకవేళ ఇలాగే కథ చేయదల్చుకుంటే, హీరోని ఇలాగే చూపించి- చివరికి బల్బు వెలిగిన ఎస్సై శ్రీకాంత్ అయ్యంగార్ చేత- ‘రేయ్ ఫూల్, ఇంత అజ్ఞానమేంట్రా నీకూ…నీ రేచీకటితో ఇన్ని తిప్పలు పడుతూ కేసు సాల్వ్ చేస్తావా? రేచీకటికి చికిత్స వుందటరా – వెళ్ళి బాగు చేయించుకో ఫో’ – అని ఒక్కటి పీకి వుంటే, ‘ఔనా? చికిత్స వుందా?’ అని హీరో షాక్ తింటే – కామిక్ రిలీఫ్ తో బాటు, కథ ఇలా చేయడం జస్టిఫై అయి వుండేది.
అయితే ఇలా చేయడానికి అసలంటూ రేచీకటి గురించి సమాచారం సేకరించి వుండాలి కథకుడు. ఈ పాయింటుతో హాలీవుడ్ సినిమాలు ఎందుకు రాలేదో వూహించ వచ్చు. ఇది పాయింటే కాదు గనుక.
తమిళంలో రెండు వచ్చాయి – శివాజీ గణేశన్ – కెఆర్ విజయ లతో ‘తవపుదువలన్’ (1972) అనే డ్రామా; ‘సిక్సర్’ అనే రోమాంటిక్ కామెడీ (2019). కన్నడలో ఒకటి వచ్చింది- ‘అంధగార’ అనే థ్రిల్లర్ (2018).
ఇక ఈ క్రైమ్ జానర్ కథకి ఏ జానర్ మర్యాదా లేదు. క్రైమ్ జానర్లో ఈ కథ పోలీస్ ప్రొసీజురల్ సబ్ జానర్ కిందికొస్తుంది. కానిస్టేబులైన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తాడు కాబట్టి. హీరో కామిక్ పాత్రతో కథ ప్రకారం చూస్తే, కంటి చూపు లోపంతో ఇతడి ఇన్వెస్టిగేషన్ అవకతవకగా నవ్విస్తూ- మరో వైపు తన లోపాన్ని అధిగమించే తపనతో యాక్సిడెంటల్ గా కిల్లర్స్ దొరికిపోవడమనే హిలేరియస్ ఎంటర్ టైనర్ గా, యూత్ అప్పీల్ ని పిండుకోవాలి, అలా బాక్సాఫీసుని దండుకునే ప్రయత్నం చేయాలి.
కానీ జరిగిన నేరాన్ని చూపించాక దాన్నెలా సాల్వ్ చేయాలో తెలియలేదు కథకుడికి/దర్శకుడికి. అసలే కామన్ సెన్సు లేని కథ అనుకుంటే, దానికి నాన్ సెన్సికల్ కథనం తోడయ్యింది. సెకండాఫ్ అంధకారంగా మారింది.
నటనలు – సాంకేతికాలు
కిరణ్ అబ్బవరం కానిస్టేబుల్ పాత్రకి సరిపోతూ రేచీకటి సమస్యతో ఫస్టాఫ్ వరకూ వినోదాన్ని పోషించగల్గాడు. సెకండాఫ్ లో కానిస్టేబుల్ పాత్రనీ, రేచీకటినీ, వీటితో వినోదాన్నీ మర్చిపోయాడు. సెకండాఫ్ కథేమిటో తెలియకుండా పోతే ఏం నటించ గలడు. చాలా కృత్రిమంగా వుంది.
పైగా ఫస్టాఫ్ లో తను అనుమానించిన హీరోయిన్నే కిస్సులు కూడా పెడుతోంటే ఏం క్యారక్టర్ అనుకోవాలి, ఏం కథనుకోవాలి. ఇంకా చనిపోయిన తల్లి గారి ఆత్మే మాటిమాటికి కనబడుతూ హిత బోధ చేస్తూంటే – ఈమెకి ఈ కథతో సంబంధమేంటనుకోవాలి. సెకండాఫ్ ప్రేక్షకులకి ఎంత సహన పరీక్ష పెట్టాడో తెలుసుకుని, ఇలాటిది జరక్కుండా చూసుకోవాలి అబ్బవరం.
హీరోయిన్లిద్దరూ వేసిన పాత్రలు, నటనలు కూడా చెప్పుకోదగ్గవి కావు. ఎస్సైగా శ్రీకాంత్ అయ్యంగార్ ఓ మాదిరి. ఇక సంగీత సాహిత్య సాంకేతికాల గురించి చెప్పుకోవడాని కేమీ లేదు.
చివరికేమిటి
ఫస్టాఫ్ హీరో పాత్ర పరిచయం ప్రేమలు, రేచీకటితో పాట్లు, ఇవి సాగుతూ హత్య, దీంతో డ్యూటీ సరిగ్గా చేయలేదని సస్పెన్షన్, హత్యతో ప్రేమిస్తున్న హీరోయిన్ కి సంబంధముందని తెలియడం, ఇంటర్వెల్. ఇక సెకండాఫ్ రెండేళ్ళూ గ్యాప్. ఎందుకంటే, హత్య కేసులో సరైన సాక్ష్యాధారాల్లేవని కేసు కొట్టేసింది కోర్టు.
కథలో ఈ రెండేళ్ళ గ్యాప్ ని భర్తీ చేయడానికి కథనంతో విఫలయత్నాలు. అప్పుడు హీరో మేల్కొంటాడు. కేసు కోర్టు కొట్టేసినప్పుడే ఎందుకు మేల్కొని రంగంలోకి దూకలేదు? ఇలాటి జవాబు లేని ప్రశ్నలతో హీరో లాజిక్ కి అందని లేని సిల్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతాడు. హత్యకి కారణం కూడా బలంగా వుండదు.
సస్పెన్స్, థ్రిల్ అనే వాటికే ఆస్కారం లేదు. రోమాంటిక్ కామెడీలు ఎలాపడితే అలా తీసేసినట్టు, క్రైమ్ -సస్పెన్సులు కూడా తీసెయ్యొచ్చన్న అవగాహనతో వస్తే ఈ జానర్ అంత మంచి ఛాన్సు నివ్వదు. రోమాంటిక్ కామెడీలే తీసుకోవడం మంచిది.
—సికిందర్