రచన – దర్శకత్వం : జైన్స్ నాని
తారాగణం : కిరణ్ అబ్బవరం, నరేష్,
సంగీతం : చైతన్ భరద్వాజ్, చాయాగ్రహణం : సతీష్ రెడ్డి మాసం, కూర్పు : చోటా కె ప్రసాద్
బ్యానర్స్ : హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యూలాయిడ్
స్నిర్మాతలు : రాజేష్ దండా, శివ బొమ్మక్
విడుదల : అక్టోబర్ 18, 2025
అనేక పరాజయాల తర్వాత గత సంవత్సరం ‘క’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో కెరీర్లోలోనే పెద్ద హిట్ సాధించిన యువ హీరో కిరణ్ అబ్బవరం, తర్వాత చేసిన ‘దిల్రుబా’ తో మళ్ళీ ఫ్లాప్ నెదుర్కొన్నాడు. ఇక మరోసారి తన సత్తా నిరూపించుకునేందుకు ‘కె ర్యాంప్ ’ లో నటిస్తూ ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి జైన్స్ నాని కొత్త దర్శకుడు. యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించింది. ఇదొక రోమాంటిక్ కామెడీ. కిరణ్ అబ్బవరం ఎక్కువగా నటించి ఫ్లాపయ్యింది రోమాంటిక్ కామేడీలతోనే. మరి క- ర్యాంప్ అనే రోమాంటిక్ కామెడీ పరిస్థితేమిటి? దీంతో ఫర్వాలేదన్పించుకున్నాడా, లేక మళ్ళీ మొదటికొచ్చాడా పరిశీలిద్దాం…

కథేమిటి?
కుమార్ (కిరణ్ అబ్బవరం) ఎంసెట్ ఫెయిలవడంతో ధనవంతుడైన తండ్రి కృష్ణ (సాయి కుమార్) కేరళ లోని ఇంజనీరింగ్ కాలేజీలో భారీ డొనేషన్ కట్టి చేర్పిస్తాడు. అక్కడ జాయ్ మెర్సీ (యుక్తీ తరేజా) అనే అమ్మాయి అతడ్ని ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడుతుంది. దాంతో ఆమెతో స్నేహం చేసి ప్రేమిస్తాడు. అయితే మెర్సీకి ఒక మానసిక రుగ్మత వుంటుంది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడే ఆమె ఎవరైనా అబద్ధాలు చెప్తే సహించలేదు. ఇంకా ఆమెతో చాలా సమస్యలుంటాయి. దీంతో ఆమెని ప్రేమించకుండా ఉండలేని కుమార్ ఆమె సమస్యకి ఏ పరిష్కారం కనిపెట్టాడు? తర్వాత ఆమె ప్రేమ అతడికి దక్కిందా? ఏం జరిగింది?…అనేది మిగతా ప్రేమ కథ.
ఎలా వుంది కథ?
మానసిక రుగ్మత గల హీరోయిన్ తో గొప్ప ప్రేమ కథంటే అది బాలూ మహేంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్- శ్రీదేవి నటించిన ‘వసంత కోకిల’ (1982). ఇందులో శ్రీదేవి ఒకసారి కారు నడుపుతూండగా ప్రమాదానికి గురై, గత జీవితాన్ని మరిచిపోయి ఆరేళ్ళ బాలికలాగా ప్రవర్తి స్తూంటుంది. టీచర్ గా పనిచేస్తున్న కమల్ హాసన్ ఆమెని పిచ్చిగా ప్రేమిస్తాడు. అయితే కొంత కాలం తర్వాత ఆమెకి గతం గుర్తుకొచ్చి, ఇప్పుడు ప్రేమిస్తున్న కమల్ గుర్తుకు రాడు. దీంతో కమల్ బాధ వర్ణనాతీతం. ఈ మూవీ బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది. దీని పాత్రలు, ఎమోషనల్ డ్రామా, ట్రాజడీ పూర్తిగా వేరు.

ప్రస్తుత ‘కె- ర్యాంప్’ లో ఇలాటి పాత్రలు, ఎమోషనల్ డ్రామా లేవు. దీన్ని రోమాంటిక్ కామెడీగా తీయడం వల్ల వీటిని ఆశించలేం. అయితే రోమాంటిక్ కామెడీని కూడా హీరోయిన్ కున్న రుగ్మతతో బోలెడు ఎంటర్ టైన్ చేస్తూ నడపొచ్చు. కానీ ఈ రుగ్మత అనే పాయింటుని కథగా ఎలా డ్రైవ్ చేయాలో తెలియక పోవడంతో మొత్తం కాన్సెప్టే అపహాస్యం పాలయ్యింది.
విచిత్రమేమిటంటే ఫస్టాఫ్ హీరో హీరోయిన్ల మధ్య రోమాంటిక్ కామెడీ కాస్త ఎంటర్ టైన్ చేస్తుంది, అది రొటీనే అయినా. కానీ సెకండాఫ్ లో ఎప్పుడైతే హీరోయిన్ రుగ్మత బయటపడిందో అక్కడ్నించీ నాటు- లౌడ్ కామెడీ వచ్చి పడుతుంది. హీరోయిన్ సమస్యతో కథని ఎలా నడపాలో అర్ధం గానట్టు అసందర్భ కామెడీలు జొప్పించి ఫీల్, ఎమోషన్లు లేకుండా చేశాడు. కామెడీలో ద్వంద్వార్ధాలు అదనపు ఎట్రాక్షన్ అన్నట్టుంది. క్రియేటివిటీ కొరవడినప్పుడే ఇలాటివి జరుగుతాయి. సీనియర్ నటుడు నరేష్ కూడా ఇలాటి కామెడీని చేయడం దేనికో అర్ధం గాదు.
ఈ కథకి స్ట్రక్చర్ లేదు, కాబట్టి స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోనవసరం లేదు. కనీసం ఫస్టాఫ్ లో రొటీన్ గా నడిపిన ప్రేమ కథ కూడా సెకండాఫ్ లో లేకపోవడం, హీరో చేసే నాటు కామెడీతో చీప్ గా మారిపోవడమే కాదు,హీరో హీరోయిన్ల రిలేషన్ షిప్ కూడా గజిబిజిగా తయారవడం జరుగుతాయి. ఫస్టాఫ్ ఏదో కథ ప్రారంభించి సెకండాఫ్ దాన్ని కొనసాగించలేక చేతులెత్తేస్తున్న ఈ మధ్య సినిమాలలాగే ఇదీ తయారయ్యింది. సెకండాఫ్ తో దర్శకులకి ఏదో ఎలర్జీ ఉన్నట్టుంది.
ఇలాటి కథలకి చివర్లో మెసేజ్ ఇవ్వడం ఒక ఫ్యాషన్ అయిపొయింది. గందరగోళంగా కథ నడపడం, చివర్లో మెసేజ్ ఇవ్వడం ఇక్కడ కూడా బెడిసి కొట్టింది. అసలు ఈ కథకి కేరళ బ్యాక్ డ్రాప్ కూడా అనవసరమే. ఓనం సాంగ్ కూడా బ్యాక్ డ్రాప్ లో ఒదగలేదు.
ఎవరెలా చేశారు?
ఈసారి కిరణ్ అబ్బవరం నటనలో ఇంప్రూవ్ అయ్యాడు. ఆ స్పీడ్, ఆ ఎనర్జీ మొదటిసారి ప్రదర్శించాడు. నటించడంలో ఒళ్ళు దాచుకోలేదు, కథే సహకరించలేదు. ఇంకా కథలతో ఇలాటి పొరపాట్లు ఎందుకు చేస్తున్నాడో అర్ధం గాదు. అయితే ఈ నటన ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్ అంతా నాటు పోకడే. పాత్రకి మించిన హీరోయిజమే. ఫస్టాఫ్ లో రోమాన్స్, దాంతో కామెడీ కాస్త నీటుగా వుంటే- సెకండాఫ్ లో కథతో బాటే దారితప్పిపోయాడు. కామెడీ టైమింగ్ లో మాత్రం ఇంప్రూవ్ అయ్యాడు.
హీరోయిన్ యుక్తి మానసిక సమస్య వున్న పాత్రగా సెకండాఫ్ లో రివీలయ్యాక పాత్ర బరువుని పోషించలేక పోయింది. పోషించాలన్నా సెకండాఫ్ కథ గందరగోళంగా వుంది. ఇక హీరోయిన్ అంకుల్ గా నరేష్ పాత్ర, నటన ద్వంద్వార్ధాల కామెడీతో సరిపెట్టుకున్నాయి. హీరో తండ్రిగా సాయికుమార్ పాత్ర, నటన నీటుగా వున్నాయి. వెన్నెల కిషోర్ తో కామెడీ ట్రాక్ లో పస లేదు.

చైతన్ భరద్వాజ్ సంగీతం లో పాటలు ఫర్వాలేదు. నేపథ్య సంగీతం ఎగుడు దిగుడుగా వుంది. కొన్ని సన్నివేశాలకి సింపుల్ గా, మరికొన్ని సన్నివేశాలకి హోరుగా. సెకండాఫ్ నాటు కామెడీ కైతే చెప్పనవసరం లేదు. సతీష్ రెడ్డి కెమెరా వర్క్ లో కేరళ విజువల్స్ బ్రహ్మాండంగా వున్నాయి. ఇతర ప్రొడక్షన్ విలువలూ బావున్నాయి.
చివరి కేమిటి?
ఒక సీరియస్ మనో రుగ్మత తీసుకుని దాన్ని సీరియస్ గా కాకుండా, సున్నిత హాస్యంతోనూ గాకుండా నాటు కామెడీ చేయడం బాక్సాఫీసుకి చెరుపు చేసింది. ‘బర్ఫీ’ అనే హిందీ హిట్లో మూగ చెవిటి పాత్రతో రణబీర్ కపూర్ ఎంత హాస్యం పండిస్తాడో తెలిసిందే. కె-ర్యాంప్ కొత్త దర్శకుడు కాస్త ఇతర సినిమాల్ని రీసెర్చి చేసివుంటే ఇంత గందరగోళం అయ్యేది కాదు. కిరణ్ అబ్బవరం కి హీరోయిన్ రుగ్మత కొత్తగా అనిపించి ఈ మూవీ అంగీకరించి ఉండొచ్చు. ఆ రుగ్మత సినిమాలో ఇన్ని రుగ్మతలని తెచ్చి పెడుతుందని ఊహించి ఉండడు.అసలు సెకండాఫ్ అంటేనే ఒక ఫోబియాగా భయపడుతున్నారు ఇటీవల సినిమాల దర్శకులు. ముందు ఈ సెకండాఫ్ ఫోబియా అనే రుగ్మతని తొలగించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించుకుంటే తప్ప తీసే సినిమాలకి బాక్సాఫీసు ఆమోదం వుండదు.
రేటింగ్: 2 /5

