కరోనా మూడో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువేనని ఓ పక్క కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకో వైపు కోవిడ్ మూడో వేవ్ ఆల్రెడీ వచ్చేసిందనీ, ఆగస్ట్ రెండో వారం తర్వాత ఆ వేవ్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని ఇంకొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మూడో వేవ్ పూర్తిగా చిన్నారులను టార్గెట్ చేయొచ్చన్నది నిపుణులు చెబుతున్నమాట. అయితే, భారతదేశంలో చిన్నారులపై కరోనా తీవ్రతకు సంబంధించి మరీ అంతలా భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు కొందరు అంటున్నారు.
ఎవరి వాదనలు ఎలా వున్నా, అతి త్వరలో విద్యా సంస్థలు తెరచుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ 16 నుంచి విద్యా సంస్థలు తెరవనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ కూడా విద్యా సంస్థల్ని తెరిచేందుకు కసరత్తులు చేస్తోంది. మంచిదే, ఎన్నాళ్ళని చదువులకు దూరంగా పిల్లల్ని వుంచగలం.? ఆన్‌లైన్ చదువులంటేనే అర్థం పర్థం లేని వ్యవహారం. పిల్లలపై తీవ్రమైన మానసిక ఒత్తిడి. పాఠాలు అర్థం కాక నానా సమస్యలూ.
వీటన్నటికీ చెక్ పడాలంటే, స్కూళ్ళు తెరచుకోవాలి. కానీ, చిన్న పిల్లలు త్వరగా అనారోగ్యం బారిన పడే అవకాశం వుంటుంది. స్కూళ్ళ ద్వారా, ఇతర విద్యా సంస్థల ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదమూ లేకపోలేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, చిన్నారుల టీకా విషయంలోనూ కేంద్రం నిర్ణయం తీసుకుని, వాళ్ళకీ వ్యాక్సిన్లు వేయగలిగితే.. అప్పుడు తల్లిదండ్రులకు పెద్దగా బెంగ అనేది వుండదు. మొదటి వేవ్ తర్వాత ప్రభుత్వాలు ప్రదర్శించిన అలసత్వం రెండో వేవ్ రావడానికి కారణమయ్యింది. మూడో వేవ్ విషయంలోనూ అదే జరుగుతుందా.? ఏమో, వేచి చూడాల్సిందే.