ఎన్నాళ్ళని విద్యా సంస్థల్ని మూసేసుకుని కూర్చోవడం.? ఆన్‌లైన్ విద్యతో ఎన్నాళ్ళు విద్యార్థులు కుస్తీ పట్టాలి.? కరోనా నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టలేక, ప్రభుత్వాలు విద్యా సంస్థల్ని మూసెయ్యాల్సి వచ్చింది. క్రమంగా కరోనా నుంచి దేశం కాస్త కోలుకుంటున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో స్కూళ్ళు తెరచుకున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేటి నుంచి స్కూళ్ళను తెరుస్తోంది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి వైఎస్ జగన్ సర్కారు, ప్రభుత్వ స్కూళ్ళలో చాలా మార్పులు చేసింది. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ తరహాలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల్ని అందిస్తోంది. నాడు – నేడు.. అంటూ స్కూళ్ళ రూపు రేఖల్ని సరికొత్తగా మార్చేసింది వైఎస్ జగన్ సర్కార్. అయినా, ఇంకా చాలా స్కూళ్ళలో సౌకర్యాల లేమి, విద్యార్థుల్ని వెక్కిరిస్తోందనుకోండి.. అది వేరే సంగతి. ఇక, పొద్దున్నే స్కూల్ సమయానికి విద్యార్థులు తమ తమ స్కూళ్ళకు చేరుకున్నారు.
కరోనా నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేసేలా టీచర్లు, ప్రిన్సిపాళ్ళు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్కులు ధరించడం, శానిటైజేషన్.. ఇలా అన్ని నిబంధనల్నీ విద్యార్థులు పాటించేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. మరోపక్క, కరోనా అనుమానితుల్ని గుర్తించే దిశగా, వారిని ప్రత్యేకంగా వుంచి, ఐసోలేషన్‌కి తరలించేలా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, ఎంతలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, విద్యార్థుల్ని కరోనాకి దూరంగా వుంచడం సాధ్యం కాకపోవచ్చు. నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఏమీ లేదు. కొన్ని జిల్లాల్లో కరోనా ఇంకా ఆందోళనకరంగానే వుంది. అధికారిక లెక్కలకీ, అనధికారిక పరిస్థితులకూ అస్సలు పొంతనే లేదన్న విమర్శలున్నాయి. మరి, ప్రభుత్వం ఈ విషయంలో ఏం చెప్పదలచుకుంటోంది.? ఒకవేళ కరోనా మళ్ళీ విజృంభిస్తే ఏంటి పరిస్థితి.? ఇలా చాలా ప్రశ్నలు. కానీ, విద్యార్థుల భవిష్యత్ పాడవకూడదు. అందుకే, కరోనా మహమ్మారి ఇంకోసారి విరుచుకుపడకూడదనే ఆశిద్దాం.