Scene Reverse : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నది నిర్వివాదాంశం. అందుకు ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేస్తున్న సారా బట్టీలే సజీవ సాక్ష్యం
ఊరూ వాడా.. కల్తీ మద్యం అందుబాటులోనే వుంది. అయితే, కల్తీ మద్యం అన్నిసార్లూ ప్రాణాలు తీసేస్తుందనలేం. కొన్ని సార్లు అది ప్రాణాల్ని హరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా అప్రమత్తమవ్వాల్సిందే. ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వున్నా, కల్తీ మద్యం వల్ల మందుబాబులు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది జరుగుతూనే వుంటుంది.
జంగారెడ్డిగూడెంలో కూడా జరిగిందదే. బాధ్యలుపై చర్యలు తీసుకుంటామని చెప్పాల్సిన ప్రభుత్వం, తొందరపడి.. ఆ మరణాల్ని సహజ మరణాలుగా బుకాయించేసింది. అక్కడే మొదలైంది అసలు రగడ. నిజానికి ఇక్కడ బేషజాలకు పోవాల్సిన అవసరమే లేదు. కల్తీ మద్యంపై ఉక్క పాదం మోపుతామని ప్రకటించేస్తే సరిపోయేది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించడంతోపాటు, వీలైతే ముఖ్యమంత్రి.. బాధితుల్ని పరామర్శించి వుండాల్సింది.
విపక్షాలు బాధిత కుటుంబాలను ఓదార్చుతోంటే, అధికార పక్షమేమో.. అసలు కల్తీ మద్యంతో ఎవరూ చనిపోలేదు.. అవన్నీ సహజ మరణాలేననడం బాధిత కుటుంబాల్ని మరింత బాధపెడుతోంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయమై ప్రజల్లోనూ ప్రభుత్వం తీరు పట్ల అసహనం వ్యక్తమవుతోంది.
చూస్తేంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లోకి వెళ్ళిపోయిందా.? అనిపించకమానదు