రెడ్డి నేతల ఆధిపత్యంలో  నలిగిపోతున్న ఎమ్మెల్యేలు.. వైసీపీలోనే ఎందుకిలా ?  

Ysrcp

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న వర్గాల్లో రెడ్డి సామాజికవర్గం ప్రధానమైనది.  ఆ తర్వాత దళిత వర్గాలు మెజారిటీ భాగం వైసీపీకి మద్దతు పలికారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుండి వైఎస్ కుటుంబానికి అండగా ఉన్న వారందరూ జగన్ అడగకుండానే వైసీపీకి జైకొట్టారు.  అందుకే గత ఎన్నికల్లో దాదాపు అన్ని ఎస్సీ, ఎస్టీ  నియోజకవర్గాలన్నిటిలో వైసీపీ జెండా ఎగురవేసింది.  అలాంటి దళిత వర్గాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటేనే వైసీపీకి భవిష్యత్తు బాగుంటుంది.  అలాకాదని నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల్లో దారుణంగా  నష్టపోవువాల్సిందే.  ఒక్కసారి దళితుల్లో నమ్మకాన్ని కోల్పోతే  తిరిగి పొందడం చాలా కష్టం.  అందుకు ఉదాహరణే  టీడీపీ.  

SC, ST MLA’s vexed with reddy leaders domination 

దశాబ్దాల తరబడి దళిత వర్గాలను తనవైపుకు తిప్పుకోవాలనే తెలుగుదేశం ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు.  ఒక్క వైఎస్ఆర్ మాత్రమే ఆ పని చేయగలిగారు.  కానీ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి చూస్తే దళిత వర్గాల ఆగ్రహానికి గురయ్యే  పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  అందుకు కారణం ఆ పార్టీలోని ఆధిపత్యపోరు.  వైసీపీలో రెడ్డి నేతలకు లెక్కా పక్కా లేదు.  అవసరానికి మించినంతమంది నేతలున్నారు.  వారిలో సగం మంది పదవుల్లో  ఉండగా సగం మంది ఎలాంటి పదవీ లేకుండానే పార్టీలో కీలకంగా ఉంటున్నారు.  పదవుల్లో ఉన్న రెడ్డి నేతలు సైతం వారికి సహకరిస్తున్నారు.  వీరు పార్టీ కార్యకలాపాల్లో మాత్రమే ఆధిపత్యం చూపిస్తే పర్వాలేదు కానీ పాలనలో సైతం వీరి ఎఫెక్ట్ స్పష్టంగా ఉంటోంది. 

SC, ST MLA’s vexed with reddy leaders domination 

దీంతో దళిత ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఏం చేయాలన్నా వీరి కనుసన్నల్లోనే చేయాల్సి వస్తోంది.  ప్రభుత్వ పరమైన కాంట్రాక్టులు సైతం ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే రెడ్డి నేతల అనుచరులకు వెళ్లిపోతున్నాయి.  దీంతో ఎమ్మెల్యేలను నమ్ముకున్న దళిత వర్గాలు నిత్యం నిరాశకు లోనుకావడం జరుగుతోంది.  నందికొట్కూరు, కోడుమూరు, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఈ సిట్యుయేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.  మొదట్లో ఈ ఆధిపత్యాన్నీ మౌనంగానే భరించిన దళిత ఎమ్మెల్యేలు ఇప్పుడు మాత్రం తిరగబడే స్థాయిలో అసంతృప్తి తయారైందట.  వీరంతా ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.  కానీ జగన్ దర్శనం వారికి దొరకట్లేదు.  అక్కడ కూడ రెడ్డి నేతల కోటరీ అడ్డుపడుతోంది.  ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వారు వేరే పార్టీని చూసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.