గొప్పలు చెప్పుకోవడం అవసరమే.. కాదని ఎవరూ అనరు. కానీ చెప్పుకునేదేదో చేసిన గొప్పలు చెప్పుకుంటే బాగుంటుందనే అందరూ అంటారు. కానీ రాజకీయాల్లో చాలామంది చేసే గొప్పలు పెద్దగా ఉండవు కాబట్టి చేయని గొప్పలను, ఘనతలను డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో చంద్రబాబు నాయుడు ఒకరు. చంద్రబాబు లాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎవ్వరూ లేరని టీడీపీ నేతలు అంటుంటారు. అందుకు ఉదాహరణగా హైదరాబాద్ హైటెక్ సిటీని చూపిస్తారు. అసలు హైదరాబాద్ ఐటీ పితామహుడిగా బాబుగారిని వర్ణిస్తుంటారు. ఇది కొంచెం ఓవర్ అయినా ఐటీ రంగ అభివృద్దిలో చంద్రబాబు కృషి ఉంది కాబట్టి వినగలం, తట్టుకోగలం. కానీ లేని, చేయని, చేయలేని గొప్పలతో డబ్బాలు కొడితేనే వినడం అసాధ్యం.
పదవిలో ఉన్నన్నాళ్లూ ఢిల్లీలో చక్రం తిప్పుతాం, అంతా మనదే అనేవారు చంద్రబాబు. తాను లేకపోతే ఢిల్లీ రాజకీయాలు నడవ్వన్నంత కలరింగ్ ఇచ్చేవారు. టీడీపీ నేతలైతే చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయనకు తెలియని రాజకీయమా, ఆయన చూడని పరిస్థితులా అనేవారు. అధికారంలో ఉన్నన్ని రోజులూ బాబుగారి ఢిల్లీ ప్రతినిధులు చేసింది ఇదే. మా నాయకుడిని మించిన నాయకుడు దేశాన లేడు అన్నారు. ఇక తెలుగు తమ్ముళ్లు అయితే చంద్రబాబుకు ప్రధాని అయ్యే అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అనేవారు. కానీ చివరకు ఏమైంది… ఏపీలోనే చిత్తు చిత్తుగా ఓడారు.
ఈ ఓటమితో అయినా బాబుగారు లేని గొప్పలు చెప్పించుకోవడం మాని వాస్తవంలోకి దిగుతారేమోనని అనుకున్నారు అంతా. కానీ మార్పు రాలేదు. పైపెచ్చు గొప్పల డోస్ ఇంకా పెరిగింది. అధికారంలో ఉన్నప్పుడు పది చెప్పుకున్నాం.. అలాంటిడి లేనప్పుడు 20 అయినా చెప్పుకోవాలని అనుకున్నారో ఏమో కానీ ఢిల్లీ లెవల్లో డబ్బా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. టీడీపీ ఎంపీలు తమ లీడర్ అధికారంలో ఉండి ఉంటే అసలు రాష్ట్రం అప్పుల్లోనే ఉండేది కాదని, సుభిక్షంగా ఉండేదని, ఎన్నో ఆదాయ వనరులు సృష్టించేవారని చెబుతున్నారు. అంతేకానీ 90 వేల కోట్ల నుండి మూడున్నర లక్షల కోట్లకు పెరిగిన అప్పుల గురించి మాట్లాడటం లేదు. అమరావతిని పకడ్బందీగా ఏర్పాటుచేయలేకపోయిన ఆయన అసమర్థతను ప్రస్తావించట్లేదు. దీంతో కొందరు జనం చంద్రబాబు అంత గొప్పవారా.. అలా అయితే ఆయన్నే ప్రధానిగా చేయండి అప్పుల్లో ఉన్న దేశాన్ని చిటికెలో గట్టెక్కించేస్తారు అంటూ వెటకారం చేస్తున్నారు.