తమిళనాడు లో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే , దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలో మాత్రం ఏ హడావిడి కన్పించడం లేదు. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే, కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. విజయ్ కాంత్ కు చెందిన డీఎండీెకే కూడా ప్రచారాన్ని ప్రారంభించకపోయినా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసుకుంటుంది.
కానీ దినకరన్ మాత్రం శశికళ రాకకోసం ఎదురు చూస్తున్నారు. శశికళ ఈ నెల 27వ తేదీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లను శశికళ తరుపున న్యాయవాదులు చేస్తున్నారు. న్యాయస్థానం విధించిన జరిమానా కూడా చెల్లించడంతో శశికళ విడుదల ఈ నెల 27వ తేదీ న ఉంటుందని ఆమె తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. శశికళ రాకతోనే ప్రచారం ప్రారంభించాలని దినకరన్ నిర్ణయించారు. శశికళకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్ణాటక సరిహద్దుల నుంచే శశికళకు స్వాగతం పలకాలని నిర్ణయించారు. సరిహద్దుల నుంచే శశికళ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. శశికళ వచ్చే మార్గంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే తమ పార్టీ ప్రచారానికి నాంది అని దినకరన్ చెబుతున్నారు. శశికళ వచ్చిన తర్వాత రాజకీయ వ్యూహాలను నిర్ణయిస్తామని దినకరన్ చెబుతున్నారు. కొంతమంది అన్నాడీఎంకే, డీఎంకే నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆమె వచ్చిన వెంటనే పార్టీలో చేరతారని దినకరన్ వర్గం చెబుతోంది.