లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్‌లోకి వచ్చి భారీ విజయాన్ని సాధించిన చిత్రం ఉప్పెన. డెబ్యూ హీరో సినిమా ఇంత భారీ విజయాన్ని సాధించడాన్ని ఎవరు నమ్మలేకపోతున్నారు. మూడు రోజులలోనే 50 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేయడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు సినిమా కోసం రాసిన లైన్, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల పర్‌ఫార్మెన్స్, నెగెటివ్ రోల్ లో అదరగొట్టిన విజయ్ సేతుపతి సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళారు. టాలీవుడ్‌లో ఇంతకముందు ఏ డెబ్యూ హీరో కూడా ఇలాంటి విజయాన్ని పొందలేదు. ఉప్పెన సక్సెస్‌ను చూసి ఆశ్చర్యపోతున్న తమిళ మేకర్స్ ఈ సినిమాను తమ భాషలో రీమేక్ చేయాలనుకుంటున్నారట.
ఉప్పెన చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించిన విజయ్ సేతుపతి ఈ చిత్ర పారితోషికానికి బదులు రీమేక్ రైట్స్ పొందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఉప్పెన రీమేక్ చేయాలని భావిస్తున్న విజయ్ సేతుపతి.. తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్‌ను హీరోగా పెట్టి సినిమా చేయనున్నట్టు టాక్. సంజయ్ ప్రస్తుతం కెనడాలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. దాదాపు ఇది పూర్తి కావొచ్చినట్టు తెలుస్తుండగా, మంచి కథ దొరికితే తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని విజయ్ ఎప్పటినుండో అనుకుంటున్నాడట. ఇప్పుడు ఉప్పెన కథ సంజయ్‌కు బాగా సెట్ అవుతుందని భావించిన దళపతి త్వరలోనే తన కుమారుడితో సినిమాని రూపొందించనునట్టు సమాచారం.
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా కెనడాలో ఉన్న సంజయ్ ఈ మధ్యే ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం సంజయ్ వయసు 19 ఏళ్లు. ఉప్పెన రీమేక్‌తో ఆయన ప్రేక్షకులని అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా, ఉప్పెన చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తుండగా, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రానున్న రోజులలో ఈ చిత్రం మరిన్ని మైల్ స్టోన్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.