సంగం డెయిరీ కేసులో వైఎస్ జగన్ సర్కారుకి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. డైరెక్టర్లకే డెయిరీపై పూర్తి హక్కులుంటాయని, డెయిరీ రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ, డెయిరీ ఛైర్మన్.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రను ఇటీవల ఏసీబీ అరెస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. ఆయన కస్టడీని పొడిగించేందుకు సైతం న్యాయస్థానం నిన్ననే తిరస్కరించింది. తాజాగా, సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ, రోజువారీ కార్యకలాపాల్ని సబ్ కలెక్టరుకి అప్పగిస్తూ జారీ చేసిన ప్రభుత్వ జీవోని న్యాయస్థానం కొట్టిపారేసింది. దాంతో, ప్రభుత్వానికి సంగం డెయిరీ కేసులో సూపర్ షాక్ తగిలినట్లయ్యింది. సంగం డెయిరీపై ఏసీబీ విచారణ వెనుక రాజకీయ కుట్ర వుందని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర, గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ తీరుని వివిధ అంశాలపై ఎండగడుతున్న దరిమిలా, ఆయనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ‘రాజకీయ దాడి’ అనేది టీడీపీ విమర్శ.
సరే, సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయా.? లేదా.? అన్నది వేరే చర్చ. ఆ కేసు విచారణ కొనసాగుతుంది. కానీ, డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ పెద్దల ఆలోచనే బెడిసికొట్టింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమ మొత్తాన్నీ అమూల్ సంస్థకు కట్టబెట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారనీ, ఈ క్రమంలోనే సంగం డెయిరీపైనా కన్నేశారనీ టీడీపీ ఆరోపిస్తోంది. ఆ సంగతెలా వున్నా, సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వ తొందరపాటు చర్య, ఇప్పడిలా హైకోర్టు మొట్టికాయలకు కారణమైందన్నమాట. దుందుడుకు వైఖరి రాజకీయాల్లో పనికిరాదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఇకనైనా తెలుసుకుంటారా.?