నదీ గర్భాల్ని నిర్దాక్షిణ్యంగా తవ్వి పారేస్తున్నారు. ఇది ఇప్పటి గొడవ కాదు. ఎప్పటినుంచో వున్నదే. ఇసుక, రాజకీయ నాయకులకు ప్రధాన ఆధాయ వనరుగా మారి చాలా ఏళ్ళయ్యింది. అప్పటినుంచీ, ఇసుక దోపిడీ షురూ అయ్యింది. కాదు కాదు, ఇసుక మాఫియా షురూ అయ్యింది.
తెలుగు నాట ఈ ఇసుక మాఫియా గురించి ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు చూస్తూనే వున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక మాఫియాకి అడ్డుకట్ట వేయడం సాధ్యం కావడంలేదు ఏ ప్రభుత్వానికీ. కారణం, రాజకీయ నాయకులే ఇసుకాసురులు కావడం.
ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇసుకాసురులున్నారు. ఇప్పుడు ఆ ఇసుకాసురులే, రాష్ట్రానికి శాపంగా మారారు. ఇసుక మాఫియా కారణంగానే చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కనీ వినీ ఎరుగని స్థాయిలో వరదలొచ్చి, ప్రాణ అలాగే ఆస్తి నష్టం సంభవించిందనేది రాజకీయ విశ్లేషకుల వాదన.
అయితే, దీనిపై భిన్న వాదనలున్నాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, చెరువులు ఉప్పొంగాయని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో, ఆయా నీటి వనరులు ఆక్రమణలకు గురవడంతోనే ఈ దుస్థితి.. అన్న వాదన కూడా లేకపోలేదు.
మరి, ఆక్రమణలపై ప్రభుత్వం ఏం చేస్తోంది.? ఇసుకాసురులపై ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.? అంటే, ప్రభుత్వం తరఫున చెయ్యాల్సింది చేస్తోంటే.. ఆ ఇసుక మాఫియా కావొచ్చు.. ఈ కబ్జా మాఫియా కావొచ్చు.. అంతకన్నా వేగంగా తమ పని తాము చేసేస్తున్నాయి.
కేవలం ఇసుక మాఫియానే కాదు, ఇక్కడ మట్టి మాఫియా కూడా.. ఈ దారుణానికి కారణం. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.