ఏళ్ళు గడుస్తున్నాయ్.. కానీ, ఆంధ్రపదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. చంద్రబాబు హయాంలో, అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ సైతం ఆమోదం తెలపడంతో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి అమరావతి అయ్యింది.
కానీ, చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనలో రాజధానిని నిర్మించలేక చేతులెత్తేశారు. తాత్కాలికం పేరుతో కొన్ని భవనాల్ని నిర్మించి, శాశ్వతం పేరుతో కొన్ని నిర్మాణాల ప్రారంభాన్ని చేపట్టి.. వ్యవహారాన్ని సాగదీశారు. రాజధానిని నిర్మించే అద్భుత అవకాశం దొరికిందని మురిసిపోయిన చంద్రబాబు, సినీ దర్శకుడ్ని సైతం విదేశాలకు పంపి, స్కెచ్చులేయించినా.. రాజధాని నిర్మాణమైతే ముందుకు కదల్లేదు. వైఎస్ జగన్ హయాంలో ఆ అమరావతి పనులు పూర్తిగా ఆగిపోయాయి. మొత్తంగా ఏడేళ్ళు దాటేసింది.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి.
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది.? ఈ ప్రశ్నకు కొందరి సమాధానం అమరావతి అయితే, మరికొందరి సమాధానం అమరావతితోపాటు మరో రెండు నగరాలు విశాఖపట్నం, కర్నూలు కూడా రాజధానులేనని. ఒకటో, మూడో.. ఏదో ఒకటి.. స్పష్టత అయితే రావాలి కదా.? ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో వుంది గనుక, అసలు అమరావతి అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతోందా.? లేదా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాజధాని విషయమై ఎక్కువకాలం గందరగోళం కొనసాగించడం వైఎస్ జగన్ ప్రభుత్వానికీ అస్సలు మంచిది కాదు.
మూడు రాజధానుల వ్యవహారం తేలే వరకు అమరావతిని అయోమయంలో పడేయడం కంటే, ఆ అమరావతిని అయినా అభివృద్ధి చేస్తే.. రాష్ట్రానికి అదొక ప్రధాన ఆదాయవనరు అవుతుంది.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకూ తోడ్పడుతుంది. టీడీపీ మీద పట్టుదలతోనో, మరొకరి మీద పట్టుదలతోనో.. రాష్ట్రానికి రాజధాని లేదన్నట్టుగా వ్యవహరించడం అధికార వైసీపీకి తగదు.