తన నటనతో లక్షలాది మందిని ప్రభావితం చేయగల శక్తి ఆమెకుంది. ఆమె సాయి పల్లవి. నటిగా తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు కూడా సాయి పల్లవి సుపరిచితురాలే. అలాంటి సాయి పల్లవి, రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడకూడదు.? రాజకీయాల గురించి మాట్లాడితే ఆమెను తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తప్పు పట్టకుండా ఎలా వుంటాం.?
గో సంరక్షకుల్ని మతం ముసుగులో ఉగ్రవాదానికి పాల్పడేవారితో పోల్చిచూడటమే సాయి పల్లవి చేసిన అతి పెద్ద తప్పు. గో సంరక్షకులైనాసరే, హత్యలకు విధ్వంసాలకు పాల్పడితే సమర్థించలేం. అలాగని, వారిని ఉగ్రవాదులతో పోల్చితే అదెలా కుదురుతుంది.?
‘విరాటపర్వం’ ఇంటర్వ్యూలలో సాయి పల్లవి, కాశ్మీర్ హిందూ పండిట్ల ఊచకోత వ్యవహారానికీ, గో సంరక్షకులు చేసిన అఘాయిత్యాలకీ లింకులు పెట్టి మాట్లాడింది. దాంతో, భజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు సాయి పల్లవిపై పోలీసులకు భజరంగ్ దళ్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.
‘విరాటపర్వం’ సినిమా విడుదలకు ముందు ఈ రచ్చ అవసరమా.? అని కనీసం ఆలోచించలేకపోయింది సాయి పల్లవి. హింస ఏ రూపంలో అయినా అది సమర్థనీయం కాదని చెబితే పోయేదానికి, మతం పేరుతో కాశ్మీర్‌లో మారణ హోం సృష్టించిన తీవ్రవాదులతో గో సంరక్షకుల్ని ఎందుకు పోల్చిందోగానీ, సాయి పల్లవి అడ్డంగా బుక్కయిపోయిందిప్పుడు.
ఇప్పటిదాకా సాయి పల్లవి అంటే వివాదాలకు దూరం. ఇప్పుడేమో, ఆమె పోలీస్ కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు.