టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం విదితమే. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. కరోనా నుంచి ఆయన కోలుకున్నారంటూ వార్తలొచ్చాయి. ఇంతలోనే ఆయనకు లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువవడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. విశాఖ మేయర్.. అనకాపల్లి ఎంపీ.. ఇలా రాజకీయాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సబ్బం హరి, కొన్నాళ్ళ క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. కానీ, ఏమయ్యిందో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సబ్బం హరి దూరమయ్యారు. ఆ తర్వాతి నుంచీ ఆయన జగన్ పట్ల తీవ్రమైన రాజకీయ ద్వేషంతో రగిలిపోయారు.
టీడీపీ అనుకూల మీడియా ఆయన్ని జగన్ మీద విమర్శలు చేయడం కోసం వినియోగించుకుంది. రాజకీయంగా ఒక్క తప్పటడుగు సబ్బం హరి రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేసేసిందన్నది నిర్వివాదాంశం. ఒకవేళ సబ్బం హరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచి వుంటే, ఈ రోజు ఆయన వైఎస్సార్సీపీలో అత్యంత కీలక నేతగా మారి వుండేవారు. చట్ట సభలకే వెళ్ళేవారో, పార్టీలో కీలక పదవులే దక్కేవో.. అన్నీ కలిసొస్తే మంత్రి అయ్యేవారో. రాజకీయాల్లో అంతే, కొన్ని ఈక్వేషన్స్ అర్థాంతరంగా అటకెక్కిపోతుంటాయి. ఇక, సమైక్యాంధ్ర ఉద్యమంలో సబ్బం హరి తనదైన వాయిస్ బలంగా వినిపించారు. ఆ విషయంలో ఆయన్ని అభినందించి తీరాలి. రాజకీయ విశ్లేషణల్లో సబ్బం హరి చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మూడు రాజధానుల విషయంలోనూ సబ్బం హరి, అత్యంత సమర్థవంతంగా తనదైన వాదనను వినిపించేవారు. ఆ పార్టీ, ఈ పార్టీ.. అనే వ్యవహారాలు పక్కనపెడితే, రాష్ట్రం ఓ ప్రముఖ రాజకీయ నాయకుడ్ని, రాజకీయ విశ్లేషకుడ్ని కోల్పోయిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.