”సోషల్ మీడియాలో అభిమానుల నుంచి వస్తున్న ట్రోల్సు తట్టుకోలేకనే అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాలనుకున్నా. సోషల్ మీడియాలో నాపై వస్తున్న రుమార్సులో ఎలాంటి వాస్తవం లేదు” అంటోంది పాయల్ రాజపుత్. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పై పెద్ద దుమారమే రేగింది. ఎవరెవరితోనో లింకులు పెట్టి పోస్టుల ద్వారా విమర్శలు గుప్పించారు.
ఈ పోస్టులపై పాయల్ రాజపుత్ స్పందించింది. ”నాకు ట్రోల్సు, విమర్శలు కొత్తకాదు. హాస్యాన్ని పంచుతూ పాజిటివ్ మైండ్‌సెట్‌తో చేసే ట్రోల్సుని నేను సరదాగా స్వీకరిస్తా. హద్దులుదాటిన విమర్శలే హృదయాన్ని గాయపరుస్తాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో తెలియని అస్థిరత చోటుచేసుకుంది. ఇలాంటి సంక్షుభిత స్థితిలో. అందరి అటెన్షన్ పొందే ఉద్దేశ్యంతో నేను సోషల్‌మీడియా నుంచి తప్పుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. అన్నింటికంటే ఈ విమర్శలే నన్ను ఎక్కువగా బాధించాయి. నన్ను పొగడకున్నా ఫర్వాలేదు. రెండు మంచి మాటలతో ప్రోత్సహిస్తే చాలు.
లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నా. భవిష్యత్తులో కెరీర్ ఎలా ఉంటుందో? కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో? జీవితం పూర్వంలా ఉంటుందా? అనే సందేహాలు నన్ను నిలవనీయడం లేదు. నా వయసులో ఉండే ప్రతి అమ్మాయికి ఇలాంటి సంశయాలు ఉండటం సహజం. ఇంత త్వరగా వచ్చిన గుర్తింపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దాని తాలూకు ఒత్తిడి తప్పకుండా ఉంటుందని అర్థం చేసుకోవాలి” అని చెప్పుకొచ్చింది. ఇంతకీ పాయల్ పై వచ్చిన రుమార్సు నిజమేనంటారా?! ఏమో..!?