Mangalavaaram 2: ‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ తర్వాత ‘మంగళవారం’తో మరోసారి తన మార్క్ చూపించాడు. 2023 నవంబరులో విడుదలైన ఈ చిత్రం థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. దీంతో అజయ్ తన తదుపరి సినిమాగా ‘మంగళవారం 2’ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, ఈ సీక్వెల్‌లో ఒక ప్రధాన మార్పు ఉండబోతోందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే.. మొదటి పార్టులో లీడ్ రోల్ పోషించిన పాయల్ రాజ్‌పుత్, ఈ సీక్వెల్లో ఉండట్లేదట. ఆమె పాత్ర కథలో ముగిసిపోయినందున, కొత్త కథను అనుసరించి వేరే హీరోయిన్‌ను తీసుకోబోతున్నట్టు సమాచారం.
‘ఆర్ఎక్స్ 100’లోనే కాదు, ‘మంగళవారం’లోనూ పాయల్ రాజ్‌పుత్ తన విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. హార్మోన్ల సమస్యతో బాధపడే మహిళ పాత్రను నిజాయితీగా పోషించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రదర్శన చూసిన వారెవరూ ఆ పాత్రకు మరో హీరోయిన్‌ను ఊహించలేరనేంత స్థాయిలో పాయల్ ఆకట్టుకుంది. అందుకే ‘మంగళవారం 2’లో ఆమె లేకపోవడం అభిమానులను నిరాశపరిచే విషయం.
అయితే, కథలో కొత్త మార్పులతో సీక్వెల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త హీరోయిన్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. అయితే, అజయ్ భూపతి గత చిత్రాల్లో ఎలా విభిన్నమైన కథలు ఎంచుకున్నాడో చూస్తే, ఈ సీక్వెల్ కూడా ప్రత్యేకమైనదిగా ఉండే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న నేపథ్యంలో, ‘మంగళవారం 2’పై మరింత ఆసక్తి పెరిగింది.