Accident: ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం…!

Accident: ఆర్టీసీ బస్సులో ప్రయాణం అందరికీ క్షేమం అని మనం వింటుంటాం. కానీ ప్రస్తుత కాలంలో బైకులు, కార్లు మాత్రమే కాకుండా ఆర్టీసీ బస్సులో వెళుతున్న కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో జరిగిన బస్సు యాక్సిడెంట్ లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహబూబాబాద్ మండలంలో ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఒక గేదె అడ్డు రావడంతో ఈ ప్రమాదం వాటిల్లింది.

వివరాల్లోకి వెళితే…కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుండి భద్రాచలంకు ప్రయాణికులతో భయలుదేరింది. అయితే బస్సు మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారువద్దకు చేరుకోగానే వేగంగా వెళుతున్న బస్సు ఒక గేదె అడ్డు రావడంతో డ్రైవర్ గేదెను తప్పించబోయిన క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు గేదె ను డీ కొని ఎదురుగా ఉన్న ఒక చెట్టుకు ఢీ కొట్టింది.ఒక్కసారిగా ఈ ఘటన జరగగానే బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13మంది ప్రయాణికులు గాయాలయ్యాయి.కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఊరటనిచ్చింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారందరినీ పరీక్షించిన వైద్యులు గాయపడిన వారిలో ఎవ్వరికీ ప్రాణాపాయం లేదని నిర్ధారించారు. గ్రామాలలో ప్రజలు పశువులను విచ్చలవిడిగా వదిలేయటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా బస్సుకు అడ్డొచ్చిన గేదె చనిపోయింది. అలాగే చెట్టును ఢీకొట్టడంతో ఆర్టిసి బస్సు ముందుబాగం నుజ్జునుజ్జయ్యింది.