Accident:అతి వేగం ప్రమాదకరం అని అందరికీ తెలిసిన విషయమే, అయితే ఎవరు పాటించరు. ఫలితంగా నిండు జీవితాలు బలవుతాయి. అతివేగం కారణంగా డ్రైవింగ్ చేస్తున్న వారికే కాకుండా రోడ్డు పక్కన ఉన్న అమాయకులు కూడా బలి అయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లా లోని జనగామ-హైదరాబాద్ రహదారి మీద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు, మరొక 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
వివరాలలోకి వెళితే…. యాదాద్రి భువనగిరి జిల్లా లోని ఆలేరు వద్ద బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.పనుల నిమిత్తం నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉంచారు. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. వరంగల్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుండి హైదరాబాద్ కు వెళ్తోంది. డ్రైవర్ బస్సును వేగంగా నడపటం వల్ల అదుపుతప్పి ఒక్కసారిగా ట్రాక్టర్ ను ఢీకొంది, ఆ ట్రాక్టర్ పనిచేస్తున్న కూలీల మీద నుండి దూసుకుపోవడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొక ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను స్థానిక ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతులు అందరూ భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన వారిగా పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా మితిమీరిన అతి వేగంగా బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదం కారణంగా జనగామ- హైదరాబాద్ రహదారి మీద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.