Roja : చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడో సారి గెలిచే అవకాశం వైసీపీ ఎమ్మెల్యే రోజాకి వుంటుందా.? లేదా.? ఈ విషయమై చిత్తూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘కష్టం, చాలా కష్టం..’ అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాల్లో అయితే, రోజాకి ఈసారి గడ్డు పరిస్థితి ఎదురవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
పేరుకే రోజా, నగిరి ఎమ్మెల్యే. కానీ, అక్కడ పెత్తనమంతా రోజా వ్యతిరేకులదే అయిపోయింది. జిల్లాకి చెందిన మంత్రులు సైతం, రోజాకి తగిన ప్రాధాన్యత పార్టీ పరంగా ఇవ్వడంలేదట. పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు నేపథ్యంలో రోజా వర్గం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే, వాటిని రోజా వ్యతిరేక వర్గం చించి పారేసింది.
అంతేనా, రోజా ఈసారి గెలిచే అవకాశమే లేదని.. అసలు ఆమెకు టిక్కెట్టే దక్కదనీ.. ఒకవేళ టిక్కెట్ దక్కించుకుంటే ఓడించి తీరతామని రోజా వ్యతిరేక వర్గం శపథం చేసేస్తోంది. ప్రభుత్వ వ్యహారాలకు సంబంధించి, రోజా వ్యతిరేక వర్గానికే ప్రాధాన్యత దక్కుతోందక్కడ.
అధినేత వైఎస్ జగన్ మీద ఈగవాలకుండా చూసుకునే బ్యాచ్‌లో రోజా పేరుని ప్రముఖంగా చెప్పుకోవాలి. కానీ, రోజాకి మాత్రం అధినేత వైఎస్ జగన్ నుంచి ఆదరణ కరవయ్యిందని రోజా అనుకూల వర్గం వాపోతోంది నగిరిలో. గత కొంతకాలంగా నగిరిలో ఈ పంచాయితీ నడుస్తూనే వుంది. అయినా, సమస్యను చక్కదిద్దేందుకు పార్టీ అధినాయకత్వం ప్రయత్నించడంలేదు.