రివర్ బోర్డులతో రెండు తెలుగు రాష్ట్రాలకీ నష్టమేనా.?

River Boards: Big Loss To Both States?

River Boards: Big Loss To Both States?

గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన అరవై రోజుల్లోగా బోర్డుకి 200 కోట్లు చొప్పున ఇరు రాష్ట్రాలూ నిధుల్ని డిపాజిట్ చేయాలన్నది ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నేపథ్యంలో కేంద్రం, విడుదల చేసిన గెటిట్ తదనంతర పరిణామాల సారాంశం. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదనీ, సుదీర్ఘ కాలంగా చర్చలు జరిపి బోర్డులను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుని, గెజిట్ జారీ చేశామని కేంద్రం స్పష్టం చేసింది. నోటిఫై చేయబడిన బోర్డుల పరిధిలోకి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు చేరాయి.

ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యత మొత్తం కేంద్రానిదే. అవసరమైన నిధుల్ని తెలుగు రాష్ట్రాలు సమకూర్చాల్సి వుంటుంది. బోర్డు ఎలా తేల్చితే అలా నీటి వాటాల్ని తెలుగు రాష్ట్రాలు పంచుకోవాల్సి వుంటుంది. ప్రాజెక్టుల భద్రత కూడా కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరుగుతుంది. వాటి ఖర్చునీ ఇరు రాష్ట్రాలూ భరించాల్సి వుంటుందట. ‘మేం సాధించాం.. రాజ్యాంగ పద్ధతుల ద్వారానే విజయం సాధించాం..’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకుంటోంది.

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు కేంద్రం తీరు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తప్పు పడుతున్నారు. ఏపీలో కూడా ఇదే భావన వ్యక్తమవుతోంది. నీళ్ళపై పెత్తనాన్ని పూర్తిగా కేంద్రం చేతుల్లో పెట్టేసి, కేంద్రం వద్ద (బోర్డుల వద్ద) రాష్ట్రాలు బిచ్చమెత్తుకునే పరిస్థితిని తీసుకొచ్చారంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి.. రచ్చ చేసుకోవడంతో, ఇప్పుడు వివాదం రెండు రాష్ట్రాల్నీ నిలువునా ముంచేసిందని అనుకోవాలేమో.