Rifts Between Chiru and Pawan : అసలు ప్రతిసారీ చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలంటూ ఎందుకు ప్రచారం జరుగుతున్నట్టు.? నిప్పు లేకుండా పొగరాదన్నది తరచూ మనం మాట్లడుకునే మాటే. కానీ, మారిన ప్రపంచంలో నిప్పుతో సంబంధం లేకుండానే పొగ వచ్చేస్తుంటుంది. ఆ పొగ కాస్తా ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టేస్తుంటుంది. ఆ పొగ ఇంకోటేదో కాదు.. దుష్ప్రచారం.
మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇద్దరి ఆలోచనలు వేరు. కానీ, గమ్యం ఒకటే. సినీ రంగంలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల విషయంలో ఇద్దరూ ఎవరికి వారే అత్యున్నత స్థానంలో వున్నారు. అన్న చాటు తమ్ముడు కాదు, అన్నను మించిన తమ్ముడు.. ఈ మాట చిరంజీవికే గర్వకారణం.
అయితే, రాజకీయంగా చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ మధ్య భిన్నమైన ఆలోచనలున్నాయి. అందర్నీ కలుపుకుపోయే తత్వం చిరంజీవిది. పవన్ కళ్యాణ్ రూటే సెపరేటు. చిరంజీవి రాజకీయాల్లో సాధించలేకపోయినది, పవన్ కళ్యాణ్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఇంకా ఎక్కువ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నారు.
‘అత్యున్నత స్థానంలో నిన్ను చూడాలనుకుంటున్నాను. నా తమ్ముడి మీద నాకు నమ్మకం వుంది..’ అంటూ పవన్ కళ్యాణ్ సమర్థత మీద పలు సందర్భాల్లో చిరంజీవి చాలా నమ్మకంగా వ్యాఖ్యానించారు.
‘చిరంజీవి నాకు అన్నయ్య మాత్రమే కాదు.. తండ్రి తర్వాత తండ్రి లాంటోడు..’ అని పలు సందర్భాల్లో పవన్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఎలాగైతే పవన్ సినిమాల్లో చిరంజీవి జోక్యం చేసుకోలేదో, పవన్ రాజకీయాల్లో కూడా చిరంజీవి జోక్యం చేసుకోవడంలేదు. అంతమాత్రాన చిరంజీవి – పవన్ మధ్య విభేదాలున్నాయనడం అర్థం లేని విషయం.