RGV Virus : ఆర్జీవీ పైత్యం.. ఎప్పుడెలా ఎవరి మీద దాడి చేస్తుందో.!

RGV Virus : గుడివాడకు కాసినో ట్రెండ్ తీసుకొచ్చిన మంత్రి కొడాలి నాని.. అంటూ వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా కుప్పలు తెప్పలుగా ట్వీట్లు కురిపించిన వైనం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఖాళీగా కూర్చుని, ఏదో ఒక ట్వీటెయ్యడం తప్ప ఆర్జీవీకి మరో పనేమీ లేకుండా పోయిందని చాలామంది ఆయన మీద జాలి ప్రదర్శిస్తున్నారు.

టైమ్ పాస్ కోసం కొందరు ఆర్జీవీ ట్వీట్లను ఎంజాయ్ చేయడం మామూలే. దాన్ని ఆర్జీవీ సీరియస్‌గా తీసుకుంటారు. అదే ఆయనతో వచ్చిన సమస్య. ఎప్పుడూ ఎవరో ఒకర్ని గిల్లుతానని వర్మ అనుకుంటాడుగానీ, వర్మ చేసే కామెడీని ఎంజాయ్ చేసేవారికి.. వర్మలో సీరియస్‌నెస్ ఎప్పుడూ కనిపించదు. సరే, సోషల్ మీడియాలో బోల్డంత కామెడీ పండిస్తున్నాడులే.. అనుకుంటారు చాలామంది.

కొడాలి నాని ప్రస్తుతం కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. కోలుకున్నాక ఎటూ ఆర్జీవీ మీద కొడాలి నాని మార్కు ‘బూతు’ పురాణం తప్పదనుకోండి.. అది వేరే సంగతి. చిరంజీవిలా, పవన్ కళ్యాణ్‌లా ఆర్జీవీని కొడాలి నాని ఉపేక్షిస్తారని అనుకోలేం.

సంక్రాంతి నేపథ్యంలో కొడాలి నానికి చెందిన ఓ కన్వెన్షన్ సెంటర్‌లో కాసినో నిర్వహించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్యాసినో నిర్వహించిందే కొడాలి నాని.. అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవి ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమే. ఆ ఆరోపణల్ని పట్టుకుని ఆర్జీవీ ట్వీట్లెయ్యడమనేది క్షమించరాని నేరమేనన్నది కొడాలి నాని అభిమానుల వాదన.

మెగా కాంపౌండ్ మీద బోల్డంత విషం చల్లేసి.. ఫలితంగా చీవాట్లు తిన్న వర్మ, డైవర్షన్‌లో భాగంగా ఇప్పుడు కొడాలి నాని మీద పడ్డారని అనుకోవాలేమో.!