తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత. ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయంగా బద్ధ విరోధి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరికించింది తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో. ఆ కేసు ఇంకా అలా అలా కొనసాగుతూనే వుందనుకోండి.. అది వేరే సంగతి.
కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రేవంత్ రెడ్డి దూకెయ్యనున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఆయన తొలుత బీజేపీ వైపు చూశారంటారు కొందరు. బీజేపీ నుంచి ఆయనకు ఆశించిన రీతిలో ‘పదవి’ విషయమై హామీ దక్కకపోవడంతో ఆయన వెనకడుగు వేశారన్నది సోకాల్డ్ గాసిప్స్ సారాంశం.
సరే, అది వేరే వ్యవహారం. తెలంగానలో తెలుగుదేశం పార్టికి ఏముందని ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరతారు.? అంటే, టీడీపీ నెత్తిన కేసీయార్ ‘బీఆర్ఎస్’ పార్టీ పేరుతో పాలు పోశారు గనుక, తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశాల్ని రేవంత్ రెడ్డి గుర్తించారట.
కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డిని పంపిందే చంద్రబాబు.. అని అంటారు. అందులో నిజమెంత.? అన్నది వేరే చర్చ. కానీ, ఇప్పటికీ చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి బోల్డంత భక్తి భావం.
ఒకవేళ కేసీయార్ స్థాపించిన బీఆర్ఎస్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు సాధ్యమైతే.. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో ఊపు వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, ఒకప్పటి టీడీపీ నేతల్లో చాలామంది.. తిరిగి టీడీపీ వైపుకు వెళ్ళే అవకాశాలూ లేకపోలేదు.