సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల బాధ్యతను పూర్తిగా కుమారుడు కేటీఆర్ మీదనే పెట్టిన సంగతి తెలిసిందే. గత గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ ఊహించని ఫలితాలను రాబట్టారు. 99 కార్పోరేషన్ సీట్లు సాధించడంతో ఈసారి 100 స్థానాల లక్ష్యం పెట్టి బరిలోకి దింపారు. కేటీఆర్ మీద పూర్తి నమ్మకం ఉండటంతో కేసీఆర్ మరీ అవసరమైతే తప్ప కలుగజేసుకోవడం లేదు. జనం సైతం గ్రేటర్ ఎన్నికల వరకు తెరాస ముఖంగా కేటీఆర్ నే చూస్తున్నారు. ఇక కేటీఆర్ అయితే అన్ని విధాలా ప్రజలను ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. ప్రగతిని ప్రజలకు చూపిస్తే ఓట్లు పడతాయనే లక్ష్యంతో నగరంలో త్వరితగతిన అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు.
అనేక చోట్ల రోడ్లు, నాలాలు, దుర్గం చెరువు వంతెన, కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జిలు వంటి నిర్మాణాలను చేపడుతూ దూసుకుపోతున్నారు. కేటీఆర్ ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో అపొజిషన్ నుండి రేవంత్ రెడ్డి అంతే వేగంగా ఢీకొడుతున్నారు. దొరికిన ప్రతి అంశాన్ని అధికార పక్షం మీద ఆయుధంలా వాడుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. నగరవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చెరువులు, కాలువలు కబ్జాకు గురికావడంతో ఎక్కడి నీరు అక్కడే ఆగిపోయింది. దీన్నే రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద మాటల దాడికి వాడుతున్నారు.
వరద ముంపుకు గురైన పలు ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి తెరాస ఎమ్మెల్యేల కబ్జాల వలనే ఈ విపత్తు అంటున్నారు. కేటీఆర్ ట్విట్టర్, వీడియో కాన్ఫరెన్స్ లలో తప్ప ఎక్కడా నగరంలో ఎక్కడా కనిపించరని, సీఎం పనికిమాలిన అంశాలపై సమీక్షలు చేస్తున్నారే తప్ప, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఆయన కుమారుడు కేటీఆర్ ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవాలకు హాజరవుతారు కానీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం రారని, వరదలతో ఎల్బీనగర్ లోని పలు కాలనీల ప్రజలకు భారీ ఆస్తి నష్టం జరిగిందని మండిపడ్డారు. ఆస్తి నష్టం అంచనావేసి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా విమర్శలతో గ్రేటర్ జనంలో తెరాస ఇమేజ్ మీద దెబ్బ కొట్టాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్.