తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు రేవంత్ రెడ్డి. ఈ పేరొక్కటే తెరాసను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాంగ్రెస్ నుండి ఎదురొచ్చే ఎవ్వరినైనా తిప్పికొడుతున్న కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రేవంత్ అనేసరికి పక్కకు వెళ్లిపోతున్నారు. అందుకు రీజన్ ఏమిటనేది అందరికీ తెలుసు. ఎక్కడైతే అధికార వర్గం తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుందో అక్కడ రేవంత్ చూపు వాలిపోతోంది. తీగ లాగి డొంక మొత్తం కదిలించినట్టు ప్రతి విషయాన్నీ రగడ రగడ చేసేసి చివర్లో సవాళ్లు విసరడం రేవంత్ స్టైల్. ఒక దెబ్బ కొట్టి కాస్త గ్యాప్ ఇవ్వడం ఆయనకు అస్సలు తెలీదు. దెబ్బ మీద దెబ్బ పడిపోవాల్సిందే అంటారు. ఆ స్టైల్లోనే తెరాస మీద వరుస విమర్శలు చేస్తుంటారు.
రేవంత్ రెడ్డిలోని ఆ వేగమే అధికార పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగేలా చేస్తోంది. ఇన్నాళ్లు బయట నుండి కేసీఆర్ మీద యుద్దం చేసిన రేవంత్ తాజాగా లోపలి నుండి దెబ్బకొట్టడం స్టార్ట్ చేశారు. తెరాసలోనే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికీ వ్యతిరేక వర్గాన్ని తయారుచేస్తున్నారు. బయటకు కనబట్లేదు కానీ తెరాసలో వ్యతిరేక వర్గాలు చాలానే ఉన్నాయు. సరైన గుర్తింపు లభించడం లేదనే కోపమో, తండ్రీకొడుకుల ఆధిపత్య ధోరణిని తట్టుకోలేకనో కానీ చాలామంది లోకల్ లీడర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదవుల్లో ఉన్న నేతలు కేసీఆర్ కనుసన్నల్లో ఉండబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఈ అసంతృప్తి సెగలు ఏనాడో బయటపడేవి.
ఇప్పుడు ఆ అసంతృప్తులనే కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు రేవంత్. ఈ కూడికల్లో సామాజికవర్గ సమీకరణాలకు పెద్ద పీఠ వేస్తున్నారు. అధికార పక్షం పట్ల అసంతృప్తిగా ఏ వర్గమైతే కనిపిస్తుందో ఆ వర్గ నేతలకు టచ్లోకి వెళ్లిపోతున్న రేవంత్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. వారిని పార్టీలోనే ఉంటూ కేసీఆర్ మీదకు తిరగబడేలా చేస్తున్నారట. బయట నుండి జరిగే దాడులు ఎంతటివైనా తట్టుకోవచ్చు కానీ అంతర్గత కలహాలను అణచడం కష్టం. రేవంత్ వ్యూహాలు ఫలించి దుబ్బాక ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ఫలితాలు రివర్స్ అయితే మాత్రం అది మాస్టర్ స్ట్రోకే అవుతుంది. మరి రేవంత్ ఎత్తుగడల నుండి కేసీఆర్, కేటీఆర్ ఎలా తప్పించుకుంటారో చూడాలి.