తెలంగాణలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో వరుసగా రెండో సారి గెలిచి అధికారం చేపట్టగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పొత్తులో సైతం కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సగానికి పైగా ఇప్పటికే పార్టీనీ వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదురుకుంటున్న కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేసే దిశగా అదిష్టానం పావులు కదుపుతుంది. అందుకే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తికి పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అప్పగించాలని భావించింది. అయితే ఈ పదవి కోసం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, హనుమంతరావు వంటి వారు పోటీపడుతున్నా అధిష్టానం మదిలో మాత్రం రేవంత్ రెడ్డి పేరు మెదలుతున్నట్టు టాక్. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఅర్‌ను ధాటిగా ఎదుర్కొని మాట్లాడగలిగే సత్తా రేవంత్ రెడ్డిలో ఉండడం, కొడంగల్‌లో ఓడించినా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్‌గిరిలో ఎంపీగా గెలవడం, తన వాక్ చాతుర్యంతో ఎలాంటి వారితోనైనా జై కాంగ్రెస్ అనిపించగలిగే పవర్ ఆయనలో ఉందన్న విషయం అందరికి తెలిసిందే.
అంతా బాగానే ఉంది ఇక రేవంత్‌కి పీసీసీ కట్టబెడదాం అనుకున్న సమయంలో అధిష్టానికి సీనియర్ నేతల నుంచి ఒతిళ్ళు పెరిగిపోయాయి. పార్టీలో ఎన్నో ఏళ్ళుగా నమ్మకంగా ఉన్న తమను కాదని నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు ఇస్తారా అంటూ అధిష్టానంపై మండిపడుతూ, తమకు కాదని రేవంత్‌కి కనుక పీసీసీ కట్టబెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ చీలిపోతుందన్న ముందస్తు బెదిరింపుల ధోరణితో వారంతా మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సమయంలో సీనియర్లను కాదని రేవంత్‌కి పీసీసీ కట్టబెడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపై పూర్తిగా అన్ని విషయాలను తర్పీధు వేసుకుని అధిష్టానం ఆలోచించి అడుగులు వేసేందుకు సిద్దమైనట్టు సమాచారం.
ప్రస్తుతం అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో జోరు మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో అడ్డుకట్ట వేసేందుకు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కరెక్టుగా సరిపోతాడని కాంగ్రెస్ అధిష్టానం భావించిందని, ఇక ఆలస్యం చేయకుండా సీనియర్లను బుజ్జగించి రేవంత్‌కు పార్టీ పగ్గాలు అప్పచెప్పి 2023లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కాంగ్రెస్ హై కమాండ్ సిద్దమైతున్నట్టు పార్టీలో నడుస్తున్న అంతర్గత సమాచారం. ఇదే కనుక జరిగి నిజంగా రేవంత్ రెడ్డికి టీపీసీసీ కనుక దక్కితే వచ్చే ఎన్నికలు పూర్తి రసాభాసగా మారుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదండోయ్..!