తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ మీద బలంగా ఫైట్ చేస్తున్న నేత ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. కేసీఆర్ మీద మెల్లగా మొదలైన రేవంత్ పోరు చిలికి చిలికి గాలివానగా మారింది. కేసీఆర్ సైతం రేవంత్ రెడ్డిని చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఎలాగైనా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయినా రేవంత్ తగ్గట్లేదు. కేసీఆర్ ఏ పని తలపెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించడమో, అందులో లొసుగులు వెతకడమో చేస్తుంటారు. కేసీఆర్ ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో పాత సచివాలయం భవనాన్ని కూల్చడం అతి ముఖ్యమైనది. ఈ పని చేయడానికి కేసీఆర్ ఎంతో శ్రమించారు. అలాగే రేవంత్ రెడ్డి కూడ కేసీఆర్ ఆశ నెరవేరకుండా చేయాలని ఎంతగానో ట్రై చేశారు. చివరికి భవనం కింద నిజాం కాలంనాటి గుప్త నిధులు ఉన్నాయని కూడ అన్నారు.
కానీ సచివాలయం కూల్చివేతను ఆపాలన్న రేవంత్ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి కేసీఆర్ అనుకున్నట్టే కూల్చివేత జరిగిపోయింది. దీంతో రేవంత్ అహం దెబ్బతింది. కూల్చివేతతో ప్రజాధనం వృధా అవుతోందంటూ రేవంత్ దాఖలు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో రేవంత్ రెడ్డిలో పంతం మరింత పెరిగింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని గతంలో సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ ఆ తీర్పును అయిధంగా వాడుకుని సుప్రీంలో పోరాడాలని రేవంత్ గట్టిగా అనుకుంటున్నారు.
అంతేకాదు ఇదివరకే జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు పిర్యాధు చేసిన రేవంత్ ట్రిబ్యునల్ బృందానికి దగ్గరుండి తన వాదన వినిపించారు. రేవంత్ పంతం చూస్తే కేసీఆర్ ను ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మెట్లు ఎక్కించాలని గట్టిగా ట్రై చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో సైతం తన మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరేసి తెరాసకు గట్టి షాకివ్వాలని రేవంత్ బలంగా పనిచేస్తున్నారు. చూడబోతే రానున్న రోజుల్లో కేసీఆర్ వెర్సెస్ రేవంత్ రెడ్డిల పోరు మరింత తీవ్రంగా మారే సూచన కనిపిస్తోంది.