సోషల్ మీడియా వేదికగా ‘రిజైన్ మోడీ – రాజీనామా చేసెయ్ నరేంద్ర మోడీ’ అంటూ నినదిస్తున్నారు చాలామంది. దేశవ్యాప్తంగా ఇప్పుడీ ‘రిజైన్ మోడీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. రోమ్ తగలబడిపోతోంటే, నీరో చక్రవర్తి తనకేమీ పట్టదన్నట్లు ఫిడేల్ వాయించినట్లు.. భారతదేశంలో కరోనా మహమ్మారి కారణంగా మారణమోమం కనిపిస్తోంటే, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం, డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలో కరోనా చికిత్స కోసం వాడుతున్న రెమిడిసివిర్ ఔషధం కొరత వుంది.. వ్యాక్సినేషన్ కూడా దేశవ్యాప్తంగా జరగాల్సిన వేగంతో జరగడంలేదు. ఇంకోపక్క, రికార్డు స్థాయిలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నేడో రేపో 3 లక్షల కేసులు దాటితే, వారం తిరగకుండానే ఈ సంఖ్య 5 లక్షలకు (రోజువారీ కేసులు మాత్రమే) చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండకపోవచ్చు. నిజానికి, ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. కాస్త ముందుగానే కోలుకుని, ఓ వారం రోజులు లాక్ డౌన్ పెట్టినా, పరిస్థితి అదుపులోకి వచ్చేదే. ఇప్పుడు నెల రోజులు లాక్ డౌన్ పెట్టినా పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు.. అసలు కేంద్రానికి లాక్ డౌన్ ఆలోచన వున్నట్టు కూడా లేదు. ‘మీ ఖర్మకి మీరు చావండి..’ అంటూ రాష్ట్రాలకే బాధ్యత వదిలేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.
వలస కూలీలు విలవిల్లాడిపోతున్నారు.. సామాన్యులకు చావే శరణ్యమవుతోంది. కానీ, సమీక్షల పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ కాలయాపన చేస్తున్నారు. ‘ప్రపంచానికి మనం వ్యాక్సిన్ అందిస్తున్నాం..’ అని గతంలో చెప్పిన మోడీ, దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం వెళితే ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయంటూ వాపోతున్న ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతారు.? విపక్షాల విమర్శలు మాత్రమేనని కొట్టిపారేయడానికి వీల్లేదు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. స్మశానాల్లో కాలుతున్న శవాల లెక్కకీ, అధికారికంగా వెల్లడవుతున్న మరణాలకీ పొంతనే వుండడంలేదు. రెండు రెట్లు.. ఐదు రెట్లు.. పది రెట్లు.. అంతకు మించి ఎక్కువే వుండొచ్చు అనధికారిక మరణాల సంఖ్య.. అధికారిక మరణాలతో పోల్చితే.. అన్న వాదనల్లో నిజమెంతో కేంద్రం స్పష్టతనివ్వాలి.