అరరె, తెలంగాణ రేణుక.. ఏపీ అమరావతికి మద్దతిచ్చారేంటో.!

తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మద్దతు పలికారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆమె ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆమె రాజకీయాల్లో చక్రం తిప్పారు.. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నేతగా ఎదిగారు కూడా.

సో, కాంగ్రెస్ జాతీయ నేత గనుక, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై ఆమె స్పందించడంలో వింతేమీ లేదు. అయితే, రాజధాని అమరావతికి ఆమె మద్దతు పలకడమే కాస్తంత విశేషం. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ, ‘ఏకైక రాజధాని అమరావతి’ అంటోంది గనుక, ఇక్కడా రేణుకా చౌదరి నిర్ణయాన్ని తప్పు పట్టలేమనుకోండి.. అది వేరే సంగతి.

న్యాయస్థానం టు దేవస్థానం.. అంటూ అమరావతి రైతులు పెద్ద యాత్ర షురూ చేశారు. ఈ పాదయాత్రకు రేణుకా చౌదరి సంఘీభావం పలికారు.. పైగా, ట్రాక్టర్ కూడా నడిపారు. దాంతో, అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేసేశారు.

ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే రేణుకా చౌదరి చేశారా.? లేదంటే ఇంకేమన్నా ప్రయోజనాలు ఆశించి ఆమె ఇదంతా చేస్తున్నారా.? అన్న చర్చ ఏపీ, తెలంగాణ రాజకీయ అలాగే మీడియా వర్గాల్లో జరుగుతోంది.

రైతులు ఎక్కడ సమస్యల్లో వున్నా, వారిని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని రేణుకా చౌదరి సెలవిచ్చారు. అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చిన మాట వాస్తవం. మరి, ఇదే రైతులు.. అమరావతిలో చంద్రబాబు హయాంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెదిరింపులకు గురయ్యారు. మరి, అప్పుడెందుకు రేణుకమ్మ అటువైపు చూడలేదట.?

ఏమోగానీ, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్న వేళ, రేణుక ‘అమరావతి’ పేరుతో ఎంట్రీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరమే.