కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాల వద్దనున్న వనరులు అస్సలు సరిపోవట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడ శాయశక్తులా కృషి చేస్తున్నా బాధితులకు అవసరమైన వనరులు సమకూర్చలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ కొరత బాధిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్స్ సరిపోవట్లేదు. అందుకే కోవిడ్ బాధితులకు సహాయం చేయదలుచుకున్న దాతలు ఆక్సిజన్ సమకూర్చి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దర్శకుడు సుకుమార్ ఇదే పని చేశారు. రాజోలులోని ఒక వైద్యశాలకు 25 లక్షలతో ఆక్సిజన్ సమకూర్చాలని సుకుమార్ అనుకున్నారు. డబ్బు మొత్తాన్ని సేకరించారు.
కానీ ఆఖరు నిముషంలో అసలు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అవసరం మేర ఆక్సిజన్ తయారుచేసుకోవచ్చు కదా అనుకున్నారు. అందుకే 25 లక్షలకు ఇంకో 15 లక్షలు జోడించి మొత్తం 40 లక్షలు పోగేసి ఆసుపత్రికి శాశ్వత ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. సుకుమార్ వేసిన ఈ ముందడుగుతో ఒక ఆసుపత్రికి శాశ్వతంగా ఆక్సిజన్ కొరత తీరిపోయింది. సుకుమార్ తరహాలోనే సినిమా సెలబ్రిటీలు, వ్యాపార రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు తలచుకుంటే ఆసుపత్రులకు ఆక్సిజన్ కొరత అనేదే ఉండదు.