నేను హిందువునే: తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి.!

Religious and Dalit Angle In Tirupathi By Poll

Religious and Dalit Angle In Tirupathi By Poll

తిరుపతి వైసీపీ అభ్యర్థి ఏ మతస్తుడు.? హిందువేనా.? హిందువే అయితే ఆధారాలు చూపాలి.. అంటూ భారతీయ జనతా పార్టీ సంధించిన ప్రశ్నకు, అట్నుంచి సమాధానం చాలా గట్టిగానే వచ్చింది. ‘నేను హిందువునే.. నామినేషన్ వేసేముందు కూడా మా గ్రామ దేవతకు పూజలు చేవాను..’ అంటూ అందుకు తగ్గ ఆధారాల్ని వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి చూపించారు. ఇక్కడితో, ఈ వివాదానికి ముగింపు పడుతుందా.? లేదా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. నిజానికి, ఈ రచ్చ తొలుత జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి విషయంలో తెరపైకొచ్చింది.

మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ హిందువు కాదు, క్రిస్టియన్ అనీ.. ఆ కారణంగా ఆమె, తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అనర్హురాలు (రిజర్వుడు సీటు గనుక) అనే విమర్శ వెల్లువెత్తింది. అయితే, అనూహ్యంగా ఆ వివాదం అక్కడితో సద్దుమణిగిపోయింది. ఇంతలోనే, వైసీపీ లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిది ఏ మతం.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్ ఈ అంశాన్ని ఘాటుగా ప్రశ్నిస్తూ, అధికార పార్టీకి సవాల్ విసిరేశారు. అంతే కాదు, హోంమంత్రి మేకతోటి సుచరితకు సంబంధించి కూడా మత ప్రస్తావన తీసుకొచ్చారు సునీల్ దేవధర్. తాను క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తానని గతంలో మేకతోటి సుచరిత ఓ ఇంటర్వ్యూలో స్వయానా వెల్లడించడం గమనార్హం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఖచ్చితమైన ప్రస్తావన వుంది.. మతం కోణంలో.

కేవలం హిందూ మతానికి చెందిన ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలు గనుక మతం మారితే, వారికి దళిత కోటాలో రిజర్వేషన్లు దక్కవు. దురదృష్టవశాత్తూ రాజకీయ అవసరాల కోసం, ఉద్యోగాల కోసం దళిత రిజర్వేషన్ పొందుతూ, మరోపక్క క్రిస్టియన్ మతాన్ని ఇంకో రకమైన అవసరం కోసం స్వీకరిస్తున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.