మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా విధి నిర్వహణలో వున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్నది ఆయనపై మోపబడిన అభియోగం. ‘ఇదంతా అధికార పార్టీ కుట్ర.. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు చాలామంది దారుణాలకు తెగబడ్డారు. వారిలో ఒకర్నయినా అరెస్ట్ చేశారా.? ఈ కుట్రని తిప్పి కొడతాం.. ముందు ముందు అధికారంలోకి రాబోయేది మేమే.. ఖచ్చితంగా ఈ చర్యలకు బదులు తీర్చుకుంటాం..’ అంటూ కొల్లు రవీంద్ర సహా టీడీపీ నేతలు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఈ తరహా అరెస్టులు జరిగినప్పుడల్లా టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గ సమీకరణాల్ని తెరపైకి తెస్తుంటారు. ‘బీసీ నేతను అణగదొక్కాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది..’ అని ఆరోపిస్తూ, కొల్లు రవీంద్ర అరెస్టుని ఖండించేశారు చంద్రబాబు. నిజానికి, చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి అరెస్టులు చాలానే జరిగాయి. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే గగ్గోలు పెట్టింది.. వార్నింగులూ ఇచ్చింది. అధికారం ఎవరి చేతిలో వుంటే, వారు పెత్తనం చేయకపోతే ఎలా.? వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మార్చుకుని కక్ష సాధింపు చర్యలకు దిగకపోతే ఎలా.? అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం పతనావస్థలో వున్న టీడీపీ, ఏనాటికైనా పుంజుకునే అవకాశం వుందా.? అన్నదే కీలకమైన ప్రశ్న ఇక్కడ. అధికార పార్టీ బెదిరింపులనండీ, అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి అనండీ.. కారణం ఏదైతేనేం, టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇక, కొల్లు రవీంద్ర గతంలోనూ ఓ సారి అరెస్టయ్యారు.. అదీ వైసీపీ సానుభూతిపరుడి హత్యకేసులో. మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు హత్యకు గురైతే, ఆ కేసులో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడం, కొన్ని రోజులపాటు ఆయనకు బెయిల్ కూడా రాకపోవడం తెలిసిన సంగతే.