Rayalaseema : కర్నూలులో హైకోర్టు కోసం రాయలసీమకు చెందిన మేధావులు గళం విప్పుతున్నమాట వాస్తవం. నిజానికి, అది ఆ ప్రాంత ప్రజల హక్కుగా భావించడాన్ని తప్పు పట్టలేం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, కర్నూలు రాజధానిగా వుండేది. ఆ తర్వాత సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటుతో కర్నూలు రాజధాని హోదాని కోల్పోయింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, రాజధాని మళ్ళీ కర్నూలుకి వెళ్ళాల్సి వున్నా, కొన్ని కారణాలతో అది కాస్తా అమరావతికి వెళ్ళింది చంద్రబాబు హయాంలో. సరే, అయ్యిందేదో అయిపోయింది.. అప్పట్లో రాజధాని అమరావతిని సీమ ప్రాంత నేతలెవరూ వ్యతిరేకించలేదు. హైకోర్టు గురించి కూడా గట్టిగా డిమాండ్ చేసింది లేదు.
కానీ, ఎప్పుడైతే వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నినాదం తెరపైకి తెచ్చారో, రాయలసీమ మేధావుల్లో మళ్ళీ చలనం వచ్చింది. ఆ మూడు రాజధానుల వ్యవహారం త్రిశంకు స్వర్గంలో వేలాడినన్నాళ్ళూ, సీమ మేధావులు గట్టిగానే గళం విప్పారు. మూడు రాజధానుల అంశం అటకెక్కాక.. మరింత గుస్సా అవుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు అంత తేలిక కాదు. మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినా, కర్నూలుకి హైకోర్టు రావడమంటే మళ్ళీ అదో పెద్ద కథ. ఇదంతా రాయలసీమ మేధావులకు తెలియని వ్యవహారమా.? తెలిసీ, నిరసన గళం విప్పడం ద్వారా అధికార వైసీపీనే సంకటంలో పడేస్తున్నారు సదరు మేధావులు.
పైకి మాత్రం వైసీపీకి అనుకూలంగా సదరు రాయలసీమ మేధావులు కనిపిస్తున్నా, వారి ఆరాటం.. అదేనండీ పోరాటం కాస్తా, ఆ ప్రాంత ప్రజల్నే మెప్పించలేకపోతోంది.