టీవీ9 రవిప్రకాష్ అంటే తెలియని వారుండరు. ఒకప్పుడు తెలుగు మీడియా రంగాన్ని గుప్పిట పట్టిన వ్యక్తి. రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన చరిత్ర ఉండాయనకు. అసలు తెలుగునాట మీడియా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇవన్నీ అయన మీదున్న ప్రశంసలైతే అంతకు మించిన ఆరోపణలు కూడ ఉన్నాయి. రవిప్రకాష్, మీడియా రంగాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ పార్టీలను, నేతలను ఎలా వాడుకున్నారో, ఆడుకున్నారో అందరికీ తెలుసు. ఒక పార్టీకి కొమ్ముకాసి మిగతా వారిని ఉద్దేశ్యపూర్వకంగా నీరుగార్చారు.
ఆయన మీదున్న ఆర్ధిక నేరారోపణలు అన్నీ ఇన్నీ కావు. దొంగ సంతకాలతో సంస్థ నిధులు దుర్వినియోగం చేశారని అనేక కేసులున్నాయి. ఆ కారణం చూపించే ఆయన్ను టీవీ9 నుండి బయటకు గెంటేశారు. బయటికొచ్చాక రవిప్రకాష్ కొత్త ఛానల్ కొనుగోలు చేస్తారంటూ రకరకాల వార్తలు వినిపించినా ఏవీ జరగలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఛానెల్ ఏదీ లేదు. అయితే ప్రజెంట్ మాత్రం రవిప్రకాష్ ఛానెల్ పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఆయన అదే పనిలో ఉన్నారట. ఆయనకు వ్యతిరేకంగా అనేక రాజకీయ శక్తులు నడుస్తుండటం వలన ఆయన పనులు ఆలస్యం అవుతున్నాయట.
ఎన్ని ఇబ్బందులొచ్చినా కొత్త ఛానల్ పెట్టే తీరాలనేది రవిప్రకాష్ అబిప్రాయమాట. అయితే ఆయన ఇప్పటికే నెలకొల్పబడి ఉన్న ఛానెల్ ఏదైనా కొని పేరు మారుస్తారా లేకపోతే అన్నీ కొత్తగా కొత్త ఛానెల్ పెడతారా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఆయనకు ఒక ప్రధాన రాజకీయ పార్టీ అండ కూడ దొరికిందని చెప్పుకుంటున్నారు. ఇకపైనా రవిప్రకాష్ ఆ పార్టీకి అనుకూలంగానే నడుచుకుంటారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తారని అంటున్నారు. మరి రవిప్రకాష్ అజ్ఞాతం వీడి ఎప్పుడు బయటకొస్తారో చూడాలి.