క‌రోనా నీ ఆట‌లు న‌డ‌వ‌వు.. త్వ‌ర‌లోనే చ‌స్తావు, అప్పుడు నేను పండ‌గ చేసుకుంటాన‌న్న న‌టుడు

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న‌క‌రోనా మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపం ఇంకా చూపిస్తూనే ఉంది.చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన మ‌హ‌మ్మారి నవంబ‌ర్ 17తో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ అనేక కామెంట్స్ పెడుతున్నారు. ద‌ర్శ‌కుడు, న‌టుడు ర‌విబాబు దీనిపై త‌న దైన స్టైల్‌లో స్పందించాడు. మై డియ‌ర్ క‌రోనా.. నీ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ అని సంబ‌ర‌ప‌డి పోతున్నావు. నేను మాత్రం మండిపోతున్నాను. త్వ‌ర‌లో వ్యాక్సిన్ వ‌స్తుంది. ప‌రిస్థితులు అన్నీ చ‌క్క బ‌డ‌తాయి. అప్పుడు నేను నీ డెత్ యానివ‌ర్స‌రీను సెల‌బ్రేట్ చేసుకుంటాను అని ర‌విబాబు పేర్కొన్నారు.

చ‌ల‌ప‌తి రావు కుమారుడైన ర‌విబాబు తెలుగు ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగాను వైవిధ్య‌మైన సినిమాలు రూపొందించాడు. ర‌విబాబు సినిమాలు కాస్త సెటైరిక‌ల్‌గా ఉంటాయి. అయితే లాక్‌డౌన్ లో క‌రోనా వ‌ల‌న చాలా ఇబ్బందులు ప‌డ్డ ర‌విబాబు వెరైటీ వీడియోల‌తో ర‌చ్చ చేశాడు. క‌రోనా వ‌ల‌న తాను ప్రొఫెష‌న‌ల్ టీ మాస్ట‌ర్‌గా మారాన‌ని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించి ప‌లు వీడియోలు కూడా షేర్ చేశాడు. స‌మ‌యానుసారం ర‌విబాబు స్పందించే తీరు నెటిజ‌న్స్‌కి చాలా వినోదాన్ని అందిస్తుంటుంది.

క‌రోనా విష‌యానికి వ‌స్తే తొలిసారి 2019లో నవంబర్ 17 చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి సోకింది. కొద్ది వారాల్లోనే అది విశ్వవ్యాప్తమై అనేక దేశాలకు వ్యాపించింది.భారత్‌లోని కేర‌ళ‌లో తొలిసారి జనవరి 30న కరోనా కేసు నమోదైంది. వుహాన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ వుహాన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ భారత్‌కి తిరిగి వచ్చిన విద్యార్ధిలో క‌రోనా ల‌క్ష‌ణాలు కనిపించ‌డంతో ఇదే తొలికేసుగా చెబుతున్నారు.