జీవిత ప్రయాణం సజావుగా సాగాలంటే మన ఆలోచనలు, నిర్ణయాలే కాదు.. కొన్ని పవిత్ర రోజుల్లో చేసే చిన్న దానధర్మాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి విశేషమైన రోజు రథ సప్తమి. సూర్యుడు తన రథంపై ఉత్తరాయణంలో ప్రయాణం ప్రారంభించే ఈ పవిత్ర దినం, మన జీవిత రథాన్ని సరైన దారిలో నడిపించుకునే సంకల్పానికి ప్రతీకగా భావిస్తారు.
సూర్యుడు కేవలం గ్రహాధిపతి మాత్రమే కాదు.. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, శక్తికి మూలాధారంగా పూజించబడతాడు. అందుకే రథ సప్తమి రోజున సూర్యారాధనతో పాటు దానం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు చేసే దానాలు ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు సహాయపడతాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది.
రాశి ప్రకారం సూర్యుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల ఫలితాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని నిపుణుల అభిప్రాయం. మేష రాశి వారికి ఎర్రటి వస్త్రాలు, శనగలు, బెల్లం దానం చేయడం వల్ల పనుల్లో స్థిరత్వం వస్తుంది. వృషభ రాశి వారు బియ్యం, పాలు లేదా తెల్ల నువ్వులు దానం చేస్తే ఆర్థిక స్థితి బలపడుతుంది. మిథున రాశి వారికి ఆకుపచ్చ దుస్తులు లేదా పెసరపప్పు దానం శుభప్రదం.
కర్కాటక రాశి వారికి పాలు, తెల్లని వస్త్రాల దానం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సూర్యుడే అధిపతి అయిన సింహ రాశి వారు గోధుమలు, బెల్లం దానం చేస్తే గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. కన్య రాశి వారికి ఆకుపచ్చ కూరగాయలు లేదా పప్పు ధాన్యాల దానం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తులా రాశి వారు బియ్యం, చక్కెర దానం చేయడం వల్ల సౌకర్యవంతమైన జీవితం పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు వస్తువుల దానం ఆత్మవిశ్వాసాన్ని పెంచి శత్రు భయాలను తొలగిస్తుంది. ధనుస్సు రాశి వారు పసుపు రంగు వస్త్రాలు లేదా పప్పు ధాన్యాలు దానం చేస్తే జ్ఞానం, శ్రేయస్సు లభిస్తాయి.
మకరం, కుంభ రాశుల వారికి నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువుల దానం శని ప్రభావాన్ని తగ్గించి సూర్య అనుగ్రహాన్ని అందిస్తుంది. మీన రాశి వారు పసుపు పండ్లు లేదా పసుపు వస్త్రాలు దానం చేస్తే ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తారని విశ్వాసం. రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేసి అర్ఘ్యం సమర్పించడం, శక్తి కొలది దానధర్మాలు చేయడం జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
