నారా లోకేష్ ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేరనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఆయనలో రాత్రికి రాత్రి మార్పులు చోటు చేసుకున్నాయి. బయటికొస్తున్నారు, జనంతో మాట్లాడుతున్నారు. తండ్రి అండ లేకుండానే పార్టీ సమావేశాలు పెట్టుకుంటున్నారు. వైసీపీకి తనదైన శైలిలో ఘాటు కౌంటర్లే ఇస్తున్నారు. అయితే ఓడిపోయిన ఏడాదిన్నరలో చినబాబులో కలగని మార్పు ఒక్కసారిగా రావడం అందరీకీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మార్పు వెనుక ఒక పెద్ద మనిషి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు పార్టీ వ్యక్తులు. అయితే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కాదట రామోజీరావట. అవును లోకేష్ బాబులో ఈ పెను మార్పుకు కారణం రామోజీరావుగారేనట.
చంద్రబాబు కొన్నేళ్లపాటు లోకేష్ ను జనం మీద రుద్దటానికి తహతహలాడారు తప్ప లోకేష్ లో మార్పు తేవడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే లోకేష్ అందరికి ఈజీగా టార్గెట్ అవుతూ జనంలో అబాసుపాలవుతూ వచ్చారు. నానాటికీ టీడీపీ పరిస్థితి దిగజారిపోటుబడటం, చంద్రబాబుకు కూడ చక్కబెట్టడం సాధ్యం కాకపోవడంతో రామోజీరావు రంగంలోకి దిగారట. ఇదే సరైన సమయమని, లోకేష్ ఇప్పుడు గనుక జనంలోకి వెళ్లగలిగితే తిరుగుండదని, అతని భవిష్యత్తు గాడిలో పడుతుందని చంద్రబాబుకు సలహా ఇచ్చారట. పర్యటనలు సహా పార్టీ కీలక పనులన్నీ చినబాబు మీద పెట్టి వెనక నుండి సహకారం ఇవ్వమని చెప్పారట.
లోకేష్ కు కూడ ఇన్నాళ్లు ఎలాగో గడిచిపోయింది ఇకనైనా మేలుకోకపోతే పార్టీ ఉండదని చెప్పి పార్టీ లేకపోతే ఎలాంటి వ్యక్తిగత ప్రమాదాలు వస్తాయో కళ్ళకు కట్టినట్టు చెప్పి ఉసిగొల్పారట. పెద్దాయన మాటలు విన్నాక భవిష్యత్తును తలుచుకుంటే ఉలిక్కిపడినంత పనైందట చినబాబుకు. అందుకే బద్ధకం, భయం వదిలేసి వేరొకరి నుండి బ్రీఫింగ్ తీసుకోవడం మానేసి సొంతగా రంగంలోకి దిగారట. తండ్రి సూచనలు ఇస్తుంటే ముందుండి పార్టీని నడిపే పనిలో పడ్డారట. ఇలా సొంతగా వ్యూవహరించారు కాబట్టే గతంలో ఎన్నడూ రానంత పాజిటివ్ రెస్పాన్స్ ఈనాడు చినబాబుకు వస్తోంది. ఇలాగే ఇంకో ఏడాది డక్కా ముక్కీలు తింటే లోకేష్ రాటుదేలి జనానికి అలవాటుపడవచ్చు. మొత్తానికి చంద్రబాబుకు ఇన్నాళ్లు ఆర్ధిక మద్దతే ఇచ్చిన పెద్దాయనే ఇప్పుడు రాజనీతి సలహాలు ఇచ్చి ఉపకరిస్తున్నారన్నమాట.