త‌ర్వాతి సినిమాలో రెట్రో లుక్‌తో క‌నిపించనున్న ఉస్తాద్ హీరో..!

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పంథా మార్చాడు. ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌ల‌తో అల‌రించిన రామ్ ఇప్పుడు మాస్ మ‌సాలా లుక్స్‌తో ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని అందించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో ఊర‌మాస్‌గా కనిపించి ఉర్రూత‌లూగించిన రామ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేశాడు. మాస్ హీరోగా రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో అద‌ర‌గొట్టేశాడంతే. ఆయ‌న అభిమానులే కాదు సినీ ప్రేక్ష‌కులు కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ ఏడాది రెడ్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రామ్ రెండు గెట‌ప్స్‌లో ద‌ర్శ‌నమిచ్చాడు.

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవ‌ల త‌న 19వ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ డైరెక్ట‌ర్ లింగుస్వామి ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నుండ‌గా, ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా తెలుగు, త‌మిళం భాష‌ల‌లో రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప‌వ‌న్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ లుక్ ఎలా ఉంటుంద‌నే సందేహం అంద‌రిలో క‌ల‌గ‌గా, తాజాగా ఓ ఫొటో చూపించి అదే అంటున్నారు.

సుకుమార్ బుధ‌వారం సాయంత్రం త‌న కూతురి వేడుక నిర్వ‌హించ‌గా టాలీవుడ్‌కు సంబంధించి ప‌లువురు సెల‌బ్రిటీల‌ను ఆహ్వానించారు. ఈ క్ర‌మంలో హీరో రామ్ కూడా ఆ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఇందులో రామ్ లాంగ్ హెయిర్ స్టైలిష్ గెడ్డంతో రెట్రో లుక్‌లో క‌నిపిస్తున్నారు. రామ్- లింగుస్వామి చిత్ర కథ ప‌క్కా మాస్‌గా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నేది స‌స్పెన్స్. రామ్ త‌న 19వ మూవీ పూర్తైన త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నాడు.