Shekar Movie Review : హృదయాన్ని కదిలించిన ‘శేఖర్’ !

Shekar Movie Review

రేటింగ్ : 3/5

చిత్రం : శేఖర్

విడుదల తేదీ : మే 20, 2022

స్క్రీన్ ప్లే-దర్శకత్వం : జీవితా రాజశేఖర్

నటీనటులు : డా.రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, ప్రకాష్ రాజ్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు

సమర్పణ: వంకాయలపాటి మురళీక్రిష్ణ

నిర్మాణం : పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్

నిర్మాతలు : బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని

Shekar Movie Review : యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌ రూటే సపరేటు. రెండు దశాబ్దాల క్రితం స్టార్‌ హీరోల్లో ఓ వెలుగు వెలిగిన హీరో అతడు. ఆయన నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధించి రికార్డులు సృష్టించాయి. ఇక రాజశేఖర్‌ పని అయిపోతుందన్న సమయంలో గరుడవేగ, కల్కీ చిత్రాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ చిత్రాలు విజయవంతం కావడంతో..అదే కిక్‌తో ‘శేఖర్‌’చిత్రం ద్వారా మరోసారి పలకరించాడు. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘జోసెఫ్‌’ చిత్రం రీమేక్‌ ఇది. రాజశేఖర్‌ సతీమణి జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం (మే 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిపెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా భారీగా చేయడంతో ‘శేఖర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ‘శేఖర్‌’ అందకున్నాడా? లేదా?, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? తెలుసుకుందాం…

క‌థ‌:

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో, కేసులను చేధించడంలోనూ శేఖర్ (రాజశేఖర్) మంచి ఎక్స్ పర్ట్. వాలంటరీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన శేఖర్ పర్సనల్ లైఫ్ లో జరిగిన బాధాకరమైన సంఘటనల ఫలితంగా మత్తుకు అలవాటు పడి నిర్లక్ష్యంగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు శేఖర్ మాజీ భార్య ఇందుకు యాక్సిడెంట్ అవుతుంది. సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోతుంది. గతంలో ఇదే హాస్పిటల్ లో తన కూతురు గీత (శివాని రాజశేఖర్ ) కూడా ఇలాగే చనిపోతుంది. దాంతో శేఖర్ కి వారి చావుల పై తీవ్ర అనుమానం కలుగుతుంది. శేఖర్ తన ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభిస్తాడు. తన భార్య, కూతురు యాక్సిడెంట్‌ లో చనిపోలేదని, వారిని ఎవరో హత్య చేశారని తెలుసుకుంటాడు. ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారు? చివరకు శేఖర్ వారి గురించి ప్రపంచానికి ఎలా తెలియజేశాడు ? ఈ క్రమంలో శేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? అనేది అసలైన కథ.

విశ్లేషణ :

సస్పెన్స్, ఎమోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దర్శకురాలు జీవిత ఇంట్రస్ట్ గా నడిపి మంచి మార్కుల్ని కొట్టేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌, ఇన్వెస్టిగేటివ్‌ చిత్రాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమే. అందుకే ఆ జానర్‌ చిత్రాలు ఎక్కువగా హిట్‌ అవుతుంటాయి. కథ, కథనం ట్విస్టులతో ఉత్కంఠంగా సాగితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడతారు. కాన్సెప్ట్ కి తగ్గట్టు ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగింది. ఫస్ట్ హాఫ్ లో అలా అలా.. హాయిగా, ఆసక్తిగా సాగిన కథనం..సెకెండాఫ్ కి వచ్చేసరికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రస్ట్ గా అనిపించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

సినిమాలో మెయిన్ క్యారెక్టైజేషన్స్ ఎఫెక్టివ్ గా ఉండి సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అలాగే హీరో క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీస్ కూడా సినిమాకి బాగా తోడయ్యాయి. హీరో ట్రాక్ ఆద్యంతం ఆలోచింపజేసే విధంగా సాగుతుంది. ప్రతి ఫ్రేమ్ లో సహజత్వం కోసం దర్శకురాలు తీసుకున్న శ్రద్ద కనిపించింది. ఆకట్టుకునే ఉత్కంఠభరితమైన కథనాన్ని ప్ర్క్షకులు మెచ్చేలా తెరకెక్కించిన దర్శకురాలు జీవితా రాజశేఖర్ ను అభినందించకుండా ఉండలేం. సినిమాలో రాజశేఖర్ నటన, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో అంశాలు బాగా కనెక్ట్ అవుతాయి.

ఈ సినిమా రాజశేఖర్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ‘శేఖర్’ పాత్రలో రాజశేఖర్ చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో రాజశేఖర్ చాలా బాగా నటించి మరోసారి మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్ కి పెద్దగా నటించే స్కోప్ లేదు. అయినప్పటికీ ఉన్నంతలో ఆమె తన క్యూట్ లుక్స్ లో అందంగా కనిపిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, అలాగే గీత పాత్రలో నటించిన శివాని రాజశేఖర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించి మెప్పించారు. ఇక జీవిత రాజశేఖర్ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్సెస్ బాగున్నాయి.

ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకురాలు జీవిత కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు. ఫస్టాఫ్‌ అంతా ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి,కూతుళ్లు(రాజశేఖర్‌, శివాణి) మధ్య వచ్చే సీన్స్‌ హృదయాలను హత్తుకుంటాయి. అలాగే భార్యతో విడిపోవడానికి దారితీసిన కారణాలు, ఒకరి బాగు కోసం మరోకరు చేసే త్యాగం..అందరిని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోవడమే కాకుండా.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌ నటనలో ఇప్పటికి జోష్‌ తగ్గలేదు. రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ శేఖర్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో అయితే అద్భుతంగా నటించారు. ఆయన కంటతడి పెట్టిన ప్రతిసారి.. ప్రేక్షకుడి హృదయం బరువెక్కుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌లో తెరపై యంగ్‌గా, స్టైలీష్‌గా కనిపించాడు. ‘కిన్నెర’ పాటలో అయితే ఒకప్పటి రాజశేకర్‌ని చూస్తారు. ఇక హీరో భార్య ఇందు పాత్రకి ఆత్మీయ రాజన్‌ న్యాయం చేశారు. శేఖర్‌ కూతురు గీత పాత్రలో శివాణి ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు కీలకం. హీరో స్నేహితులుగా సమీర్‌, అభినవ్‌ గోమతం, కన్నడ కిశోర్‌, ప్రియురాలు కిన్నెరగా ముస్కాన్‌ ఆకట్టుకున్నారు. పొసాని కృష్ణమురళితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నికల్ గా చూస్తే…:

సినిమాలో సాంకేతిక విభాగం మంచి మార్కుల్ని కొట్టేసింది. ముఖ్యంగా మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం సూపర్ గా ఉంది. అలాగే అనూబ్‌ రూబెన్స్‌ సంగీతం ఆకట్టుకుంది. చిన్ని చిన్ని ప్రాణం.. కిన్నెర పాటలతో మిగిలిన సాంగ్స్‌ కూడా బాగున్నాయి. ఈ పాటలన్నీ కథతో సాగుతాయే తప్ప..తెచ్చిపెట్టినట్లు ఉండవు. నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ ఆయింది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడా రాజీపడకుండా సినిమా బాగా రావడానికి తోడ్పడ్డారు. మొత్తం మీద మెడికల్ క్రైమ్ పై వచ్చిన ఈ ‘శేఖర్’ చిత్రం ఆద్యంతం ఆలోచింపజేస్తూ సస్పెన్స్. క్రైమ్ థ్రిల్లర్ లో విభిన్నమైన ఎలిమెంట్స్ తో సాగి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.