రాహుల్ గాంధీ పాతయాత్ర: ఇది కూడా ‘పీకే’ వ్యూహమే.!

Rahul Gandhi : కొత్త ఐడియాలే రావా.? అవే పాత ఐడియాలా.? రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తాను డీల్ కుదుర్చుకున్న అన్ని రాజకీయ పార్టీలకూ అవే పాత ‘సలహాలు’ ఇస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుని, చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న ప్రశాంత్ కిశోర్, బీహార్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకున్నాడుగానీ, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా సలహాలైతే కొనసాగిస్తున్నట్టున్నాడు పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్.

తాజాగా, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశమంతా పాదయాత్రలు చేయాలని సంకల్పించుకోవడం వెనుక పీకే వ్యూహం వుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందులో వింతేముంది.? ఇప్పుడంతా పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రల ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇలా చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు. వైఎస్ షర్మిల గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. ఈ పాదయాత్ర వ్యూహం పీకేదే.

అయితే, రాహుల్ గాంధీ పాదయాత్ర లెక్క వేరు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో సుమారు 70 కిలోమీటర్ల మేర కొన్ని రోజుల పాటు పాదయాత్రలు చేసేలా పీకే వ్యూహం ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఎటూ బీజేపీ వ్యతిరేకత దేశంలో పెరుగుతున్న దరిమిలా, రాహుల్ పాదయాత్ర సత్ఫలితాన్నిచ్చినా ఆశ్చర్యేమేమీ లేదు.