రఘురామరాజు ఉడతా భక్తి.. బీజేపీ పెద్దలకు సిగ్నల్స్

అయోధ్యలోని రామజన్మ భూమి రాముడికి చెందినదని నిరూపించి అక్కడ రామ మందిరం కట్టడం కోసం హిందూత్వ శక్తులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఎంతలా కృషి చేసిందో దేశం మొత్తానికి తెలుసు.  వాజ్పాయ్ దగ్గర్నుండి నరేంద్ర మోడీ వరకు ఈ పోరాటంలో సర్వ శక్తులు ఒడ్డారు.  చివరకు ఎట్టకేలకు ఆ భూమి రాముడికి చెందినదని చారిత్రక ఆధారాలతో నిరూపించి అక్కడ రామ మందిరం కట్టడానికి సుప్రీం కోర్టు నుండి అనుమతులు తెచ్చుకున్నారు.  వచ్చే నెల 5వ తేదీన మందిర నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి మోడీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారట.  ఈ వివాదంలో సహకరించిన ప్రతి శక్తికి బీజేపీ అండదండలు పుష్కలంగా ఉంటూ వచ్చాయి, ఇకపై ఉంటాయి కూడ. 
 
అందుకే రామ మందిరం నిర్మాణానికి దేశ వ్యాప్తంగా విరాళాలు, వివిధ రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి.  తాజాగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు తన వంతు సహకారం అందించారు.  ఎంపీ హోదాలో ఆయన తన మూడు నెలల జీతం రూ.3.96 లక్షలను మందిరం నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రకు విరాళంగా అందించారు.  రామజన్మభూమిలో రామ మందిరం కట్టాలనే దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న ఆయన లంక మీద యుద్ధం చేసే సమయంలో ఉడత రాముడికి సహాయం చేసినట్టు తాను కూడా రామ మందిర నిర్మాణంలో తన వంతుగా మూడు నెలల జీతాన్ని ట్రస్టుకు ఇస్తున్నట్టు ప్రకటించారు రాఘురామరాజు.   
 
కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఏపీలో గోశాలల సంరక్షణ విషయమై నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే లేఖ రాశారు.  ఈ చర్యలన్నీ మంచివే అయినా పూర్తిగా భాజపాను అనుసరించే చర్యలే.  వీటి మూలంగా బీజేపీ అధిష్టానం అనుగ్రహం, మెప్పు పొందడం, తానూ తమ మనిషినే అని అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ లాంటి పెద్దలకు సిగ్నల్స్ ఇవ్వాలనేది రఘురామరాజు ప్రయత్నమని స్పష్టంగా అర్థమవుతోంది.  ఇప్పటికే అధికార పక్షం వైసీపీతో జరుగుతున్న అంతర్గత యుద్దంలో రాఘురామరాజుకు సెంట్రల్ లెవల్లో బీజేపీ ఎలా సహకరిస్తోందో మనం చూస్తూనే ఉన్నాం.  ఆ సహకారం ఇంకో పది కాలాల పాటు శ్రీరామ రక్షలా తన మీద ఉండేలా చూసుకోవాలనేది రాజుగారి తాపత్రయం.