ఆర్ఆర్ఆర్ కోసం ఎంపీలందరినీ తాకట్టు పెట్టారట 

featured

నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణరాజు అవకాశం దొరికినప్పుడల్లా సొంత పార్టీ మీద, నేతల మీద సెటైర్లు వేస్తున్నారు.  ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతుందో అక్కడ ప్రత్యక్షమైపోతూ పుండు మీద కారం చల్లినట్టు ఇంకాస్త ఎత్తిపోడుస్తూ మాట్లాడుతుంటారు.  తాజాగా నిమ్మగడ్డ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.  హైకోర్టు, గవర్నర్ చెప్పినట్టు నిమ్మగడ్డను ఎస్ఈసీ పదవిలోకి తీసుకోవాలని సూచించింది.  తమ తీర్పునైనా పాటించమని వ్యాఖ్యానించింది.  దీంతో ప్రత్యర్థులు ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. 

వారిలో రఘురామరాజు కూడా ఉన్నారు.  ఇప్పటికైనా సీఎం జగన్‌ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ని తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని, కోర్టు తీర్పు మేరకు రమేష్‌ కుమార్‌ను నియమిస్తే వచ్చే నష్టం ఏమిటని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని అన్నారు.  అనవసరంగా న్యాయవ్యవస్థలతో పెట్టుకుని ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దని అంటూ నేను సలహా ఇస్తే స్వీకరించరు, సలహాదారులేమో సరైన సలహాలు ఇవ్వరు.  చెప్పుడు మాటలు విని ముఖ్యమంత్రేమో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు.

పనిలో పనిగా తన మీద అనర్హత వేటు వేయించడానికి వైసీపీ నేతల బృందం చేసిన కృషిని కూడా వివరించారు.  నా ఒక్కడి మీద అనర్హత వేటు ఎంపీలందరినీ అప్పగిస్తామని ఢిల్లీ వచ్చి వేడుకున్నారు అంటూ ఢిల్లీలో వైసీపీ నేతలు చేసిన విఫలయత్నాలను వివరిస్తూ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతు నొక్కేస్తారా, ఇది రాచరికం కాదు ప్రజాస్వామ్య దేశం. న్యాయస్థానాలను గౌరవిద్దాం, న్యాయవ్యవస్థ విలువను కాపాడదాం అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అధికార పార్టీ నేతలెవరూ మీడియా ముందుకు రాకపోయినా రఘురామరాజు మాత్రం ఎత్తిపొడవడానికే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినట్టుంది.